IT Raids on Sukumar Office: పుష్ప 2 టీమ్‌కు షాక్.. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడులు
IT Raids on Sukumar Office: పుష్ప 2 టీమ్‌కు షాక్ తగిలింది. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. బుధవారం (ఏప్రిల్ 19) ఉదయం నుంచీ ఈ దాడులు జరుగుతున్నాయి.
IT Raids on Sukumar Office: పుష్ప ది రూల్ మూవీని తెరకెక్కిస్తున్న సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కు షాక్ తగిలింది. వీళ్ల ఆఫీసులపై బుధవారం (ఏప్రిల్ 19) ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు దాడి చేశారు. ఐటీ అధికారులు గ్రూపులుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహించడం గమనార్హం. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుల్లోనే కాదు.. సుకుమార్‌తోపాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి యలమంచలి ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగాయి.
పుష్ప మూవీని డైరెక్ట్ చేయడంతోపాటు సుకుమార్‌కు ప్రత్యేకంగా సుకుమార్ రైటింగ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. దీని ద్వారా సుకుమార్ ఇప్పటికే కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీకి కూడా సుకుమార్ రైటింగ్స్ సహ నిర్మాతగా ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.
పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ నడుస్తున్న సమయంలో వీళ్లపై ఐటీ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పుష్ప తొలి పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కావడంతో పుష్ప 2ను ప్రొడ్యూసర్లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా పుష్ప ది రూల్ నిలవనుంది. ఈ సినిమా కోసం రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరిగిన వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ దాడుల్లో ఏం దొరికాయన్నదానిపై ఐటీ అధికారులు ఇంకా ఏమీ వెల్లడించలేదు. అల్లు అర్జున్, రష్మిక నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత కథనం