Amudalavalasa Election Fight: ఆముదాలవలసలో అదృష్టం ఎవరిది..? బావబామ్మర్దుల సవాల్… తమ్మినేని వర్సెస్ కూన రవి
Amudalavalasa Election Fight: శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ్మినేని సీతారామ్‌పై బామ్మర్ది కూన రవి టీడీపీ తరపున తలపడుతున్నారు.
ఆముదాల వలసలో అదృష్టం ఎవరిది?
Amudalavalasa Election Fight: శ్రీకాకుళం Srikakulam జిల్లా ఆముదాల వలసలో Speaker ఏపీ శాసనసభాపతి Tammineni Seetharam తమ్మినేని సీతారామ్ ఏడో సారి అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారామ్ 2019 ఎన్నికల్లో గెలిచి శాసనసభాపతి అయ్యారు. 2019లో సీతారామ్‌పై koona ravi kumar కూన రవికుమార్ 13,991 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
- శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రధాన హామీల్లో మూతపడ్డ చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని జగన్ ప్రకటించారు. ఆముదాలవలస చక్కెర కర్మాగారాన్ని పలుమార్లు అధికారుల బృందాలు పరిశీలించి వెళ్లాయి తప్ప ఇంతవ రకూ ఆ దిశగా చర్యలేమీ లేవు.
- పొందూరులో ఖాదీ దుస్తులు తయారుచేసేందుకు చేనేత క్లస్టరు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత క్లస్టరు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. గతంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు పరిశీలించారు తప్ప క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు.
గత ఎన్నికల్లో తమ్మినేని ఇచ్చిన హామీలు…
- ఆమదాలవలస పురపాలక సంఘంలోని వార్డులకు పైపులైన్లు వేయించి తాగునీరు అందిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వంశధార నది నుంచి తాండ్రాసి మెట్ట వరకు ప్రధాన పైపు లైన్లు ఏర్పాటు చేశారు. అక్కడ పంట పొలాల మీదుగా పైపులైన్ వెళ్లకుండా రైతులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి.
- సరుబుజ్జిలి కూడలిలో తాగునీటి పథకం ఏర్పాటు చేసి స్థానికులకు తాగునీరు అందిస్తామని చెప్పినా అది నెరవేరలేదు.
ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై ఆరోపణలు…
- తమ్మినేని సీతారాం రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద నాయకుల్లో ఒకరిగా నిలిచారు. శాసనసభలో విపక్షాలు మాట్లాడేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. అధికారులు తన చెప్పుచేతుల్లో ఉండేలా చూస్తారు. తమ్మినేని భార్య నేరుగా అధికారులపై పెత్తనం చేస్తుంటారు.
- తమ్మినేని భార్య వాణిశ్రీ, కుమారుడు చిరంజీవి నాగ్‌లు నియోజక వర్గంలో పెత్తనం చేస్తుంటారు. కుమారుడిని రాజకీయ వారసుడిగా తెచ్చే ప్రయత్నాలు చేసినా ఫలించ లేదు. భార్య వాణిశ్రీ పెత్తనంపై పార్టీ క్యాడర్‌లో సైతం అసంతృప్తి ఉంది.
- కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పోస్టులు వేయించేందుకు రూ. లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీతారాం భార్య ద్వారా అయితేనే పని అవుతుందనే పేరు ఉంది. దీంతో చాలామంది నిరుద్యోగులు ఆమెనే ఆశ్రయిస్తారు. ప్రైవేట్ సెటిల్‌మెంట్లలో సైతం తమ్మినేని సతీమణి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
- ఉద్యోగులకు వారు కోరుకున్న చోటకి బదిలీలు కావాలన్నా తమ్మినేని సతీమణినే ఆశ్రయించాలి.
ప్రధాన సమస్యలు:
ఆమదాలవలస మండలంలో
- ఆమదాలవలన చక్కెర కర్మాగారం మూతపడి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు తెరిపించలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో కర్మాగారాన్ని తెరిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి అయిదేళ్లు కావస్తున్నా ఇంతవరకు కర్మాగారం తెరవ లేదు. దీంతో కార్మికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
- ఆమదాలవలస మండలం అక్కులపేట ఎత్తిపోతల పథకం సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడు తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ పథకం ద్వారా సాగునీరు పూర్తిస్థాయిలో అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఈ మేరకు చర్యలు చేపట్టలేదు. దీంతో రైతులు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు.
- ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.37 కోట్లతో అప్పటి ప్రజాప్రతినిధి శంకుస్థాపన చేశారు. అయితే వైకాపా అధికారంలోకి వచ్చిన తరవాత 25 శాతం పనులు కాకపోవడంతో రద్దు చేసి మళ్లీ రూ.40 కోట్లతో స్పీకర్ తమ్మినేని సీతారాం పనులకు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతు న్నారు.
- ఆమదాలవలస మున్సిపాల్టీ జగ్గు శాస్త్రులపేట వద్ద మినీ స్టేడియాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రూ.25 లక్షలతో నిర్మించారు. క్రీడాకారులు దీనిలో సాధన చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆధునికంగా స్టేడియం నిర్మిస్తామని ఉన్న భవనాలు తొలగించారే తప్పా పనులు చేపట్టకపోవడంతో క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు.
- ఆమదాలవలస వద్ద నిర్మించిన వయోడెక్ట్ శిథిలావస్థకు చేరింది. ఏ క్షణంలో కూలుతుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. దీని ద్వారా వందల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా శివారు ప్రాంతాలకు చేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు వచ్చి పరిశీలించారే తప్పా ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- ఆమదాలవలస మండలం గాజులకొల్లివలన వంశధార నిర్వాసితులు ఆర్ఆర్ కాలనీలో రూ.1,50 కోట్లతో ప్రభుత్వం ఉన్నత పాఠశాలను నిర్మించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం రెండేళ్ల కిందట పాఠ శాల భవనాన్ని ప్రారంభించారు. బిల్లు రాకపోవడంతో గుత్తేదారులు అధికారులకు తాళాలు ఇవ్వకపోవడంతో ఆర్ఆర్ కాలనీ విద్యార్థులు ఆమదాలవలస వచ్చి చదువుకోవల్సి వస్తుంది.
సరుబుజ్జిలి మండలం, బూర్జ మండలం, పొందూరు మండలాల్లో సమస్యలు దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి.
- పొందూరు మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడేళ్ల కిందట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో పాటు ఉన్న తాత్కాలిక గదుల్లో మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో డిగ్రీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- పొందూరు ఖాదీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చలేదు. క్లస్టర్లను ఏర్పాటు చేసి ఖాదీ కార్మికులకు భవనాల నిర్మాణం చేపట్టి, ఖాదీపై శిక్షణ అందించి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చిన ప్పుడు హామీ ఇచ్చారు. ఇంతవరకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి నోచుకోవడం లేదు.
- ఆముదాల వలసలో అధికారాన్ని నిలుపుకోవడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఉండదనే విమర‌్శ ఉంది. నియోజక వర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తమ్మినేని హామీలకే పరిమితం అయ్యారనే విమర్శ ఉంది. తాజా ఎన్నికల్లో బావబామ్మర్దుల మధ్య జరుగనున్న పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
సంబంధిత కథనం