Boy Drowns In Drain : విజయవాడ డ్రైనేజీలో బాలుడి గల్లంతు విషాదాంతం, కిలోమీటర్ దూరంలో చిన్నారి మృతదేహం గుర్తింపు-vijayawada six year old boy abhiram drowns in overflowing drainage in gurunanak colony ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Vijayawada Six Year Old Boy Abhiram Drowns In Overflowing Drainage In Gurunanak Colony

Boy Drowns In Drain : విజయవాడ డ్రైనేజీలో బాలుడి గల్లంతు విషాదాంతం, కిలోమీటర్ దూరంలో చిన్నారి మృతదేహం గుర్తింపు

Bandaru Satyaprasad HT Telugu
May 05, 2023 05:58 PM IST

Boy Drowns In Drain : విజయవాడలో విషాద ఘటన జరిగింది. డ్రైనేజీలో గల్లంతైన ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. డ్రైనేజీ పైకప్పు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విజయవాడలో డ్రైనేజీలో బాలుడు గల్లంతు
విజయవాడలో డ్రైనేజీలో బాలుడు గల్లంతు (File Photo )

Boy Drowns In Drain : విజయవాడలో బాలుడి గల్లంతు ఘటన విషాదాంతం అయింది. శుక్రవారం ఉదయం గురునానక్ కాలనీ డ్రైనేజీలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ కాలనీకి కిలోమీటర్ దూరంలో భారతీనగర్ కాలనీ వద్ద బాలుడి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది గుర్తించారు. బాలుడి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా... అప్పటికే చిన్నారి మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కన్న కొడుకు తమ కళ్లెదుటే గల్లంతైన ప్రాణాలు కోల్పోవడంతో చిన్నారి తల్లిదండ్రులు గుండెపగిలేలా రోధిస్తున్నారు.

అసలేం జరిగింది?

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలోని పలు డ్రైనేజీలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గురునానక్ కాలనీలో శుక్రవారం ఉదయం అభిరామ్ అనే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు. ఈ డ్రైనేజీకి పై కప్పు కూడా లేకపోవడంతో బాలుడు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆ కాలనీకి కిలోమీటర్ దూరంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదకరంగా ఉన్న ఈ డ్రైనేజీ పైకప్పు వేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదుచేసిన అధికారులు పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

విజయవాడలో భారీ వర్షం

బాలుడు అభిరామ్ ఆడుకుంటూ ఉద్ధృతంగా ఉన్న డ్రైనేజీలో ప్రమాదవశాత్తు పడి మునిగిపోయాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలంలో బాలుడి తల్లిదండ్రులు వీరబాబు, నూకరత్నం రోదనలు మిన్నంటాయి. వీరబాబు కార్మికుడు. విజయవాడలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో భారీ వర్షం కురవడంతో పలు చోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులు, కాలనీలు వర్షపు నీటితో నిండిపోయి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

కాపాడేందుకు ప్రయత్నించినా...

“పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. అభిరామ్ కాలుజారి డ్రెయిన్‌లో పడిపోగా, మరో బాలుడు అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. కానీ అభిరామ్ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న డ్రైనేజీలో మునిగిపోయాడు.”అని స్థానిక నివాసి లక్ష్మి చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆరోపించారు. చాలా కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులు చేపట్టలేదని రామ్‌మోహన్‌రావు తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. అధికారులు ఇప్పటికై స్పందించి డ్రైనేజీలపై మూతలు బిగించాలని స్థానికులు కోరుతున్నారు. వచ్చే వర్షాకాలం కాబట్టి మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ముందుగా స్పందిస్తే బాలుడి ప్రాణం నిలబడేదని ఆవేదన చెందారు.

IPL_Entry_Point