Tirumala : తిరుమలలో భారీ వర్షం... మరోవైపు కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ-heavy rain in tirumala tirupati and devotees facing problems ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Heavy Rain In Tirumala Tirupati And Devotees Facing Problems

Tirumala : తిరుమలలో భారీ వర్షం... మరోవైపు కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ

HT Telugu Desk HT Telugu
May 18, 2023 05:21 PM IST

Tirumala Latest News: తిరుమలలో గురువారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసింది. మరోవైపు కిలో మీటర్ల మేర భక్తులు బారులు తీరారు. భారీ వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో భారీ వర్షం

Heavy Rain in Tirumala: ఇవాళ మధ్యాహ్నం తర్వాత తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఆలయం చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరో వైపు శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావటంతో స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఫలితంగా దర్శనం కోసం కిలో మీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు భారీ వర్షం కురవటంతో క్యూలైన్ లో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దాదాపు మూడు కిలో మీటర్లకు పైగా భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. దర్శనం కోసం దాదాపు 36 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు కావాల్సిన అన్నప్రసాదం, మంచి నీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వేసవి సెలవులు ముగిసే వరకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 15వ తేదీ వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ప్రతీ నెలా నిర్ణీత తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయించింది.

Tirumala Tickets Schedule : మరోవైపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ విడుదల చేసింది. దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల కోటా వంటి టికెట్లు కోసం భక్తులు ఎదురు చూడాల్సిన పనిలేదని, ఇకపై ప్రతి నెలా నిర్ణీత తేదీల్లోనే తర్వాతి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన తెలిపింది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. అదేవిధంగా రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఇక నుంచి దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో ఒక షెడ్యూల్ ప్రకారం విడుదల టీటీడీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది.

IPL_Entry_Point