Gorantla Madhav : కాణిపాకంలో ప్రమాణం చేయాలని చంద్రబాబుకు మాధవ్ సవాల్…-gorantla madhav challenges chandrababu to promise in kanipaakam temple on vote for notes issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Gorantla Madhav Challenges Chandrababu To Promise In Kanipaakam Temple On Vote For Notes Issue

Gorantla Madhav : కాణిపాకంలో ప్రమాణం చేయాలని చంద్రబాబుకు మాధవ్ సవాల్…

HT Telugu Desk HT Telugu
Aug 19, 2022 06:40 PM IST

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, పోలీసుల్ని దాటి దేవుళ్ల పంచాయితీకి చేరాయి. తన పై వచ్చిన వీడియో నిజం కాదని కాణిపాకంలో ప్రమాణం చేస్తానని, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు కూడా ప్రమాణం చేయాలని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు.

ఎంపీ గోరంట్ల మాధవ్
ఎంపీ గోరంట్ల మాధవ్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ వీడియోపై తాను ప్రమాణం చేస్తానని ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అంటూ గోరంట్ల మాధవ్ సవాల్ సవాల్ విసిరారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో తాను లేనని బాబు ప్రమాణం చేస్తే, తాను ఎంపీ పదవికి అక్కడే రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఫేక్ వీడియోలు, ఫేక్ సర్టిఫికేట్‌తో టీడీపీ నేతలు అడ్డంగా దొరికారని గోరంట్ల మాధవ్ విమర్శించారు. మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి టీడీపీ నేతలు తనపై బురద చల్లాలని చూస్తే పోలీసులు ప్రాథమిక విచారణలో అది ఫేక్ వీడియో అని తేలిందన్నారు. అది రుచించని చంద్రబాబు బృందం అమెరికాలోని ఎక్లిప్స్ అనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్ళి, ఒక దొంగ సర్టిఫికేట్ తెచ్చి ప్రజలను నమ్మించాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టి, టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్నారు.

సీఐడీ చీఫ్ ఎక్లిప్స్ సంస్థ అధినేతకు ఈ మెయిల్ రాస్తే, అది మేము ఇచ్చిన రిపోర్టు కాదని, టీడీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నది ఒరిజనల్ రిపోర్టు కాదని స్పష్టం చేశారన్నారు. టీడీపీ నేతలు ఏం చేయాలో అర్థం కాక, వీడియోలో ఉన్న వ్యక్తులు ఒరిజినలా, కాదా అంటూ ఇంకా ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ వీడియో ఫేక్ అయినప్పుడు, టీడీపీ వాళ్ళు తెచ్చిన సర్టిఫికేటే ఫేక్ అయినప్పుడు, వాళ్ళు ఫేక్ మనుషులేనన్నారు.

అశ్లీలమైన, దొంగ వీడియోకు సంబంధించి మాట్లాడటానికి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు ఎవరూ ముందుకు రాకపోతే... ఆ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలనే ఉపయోగించి మాట్లాడించారని ఆరోపించారు. తనపై మీద బురదజల్లారని దానికి తనకు అభ్యంతరం లేదని, టీడీపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుని, ఓటుకు కోట్లు కేసులో దొరికిన చంద్రబాబు మీద వారి సామాజిక వర్గానికి సంబంధించిన టీవీల్లో ఏనాడైనా చర్చకు పెట్టారా అని ప్రశ్నించారు.

ఓటుకు కోట్ల కేసులో తెలంగాణ ఏసీబీకి చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే, ఆంధ్రప్రదేశ్ పరువును, ప్రతిష్టను తాకట్టు పెట్టి, పదేళ్ళు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నగరాన్ని వదులుకొని, తేలు కుట్టిన దొంగలా పారిపోయి వచ్చాడని ఆరోపించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో.. చంద్రబాబు ఫోన్ లో మాట్లాడిన మాటలు, ఆయన పంపిన రూ. 50 లక్షల డబ్బులతో సహా ఆడియోల్లో, వీడియోల్లో దొరికినా ఒక్క నిమిషం అయినా ఎందుకు చర్చ పెట్టలేదన్నారు.

బాలకృష్ణ, లోకేష్ లకు వర్తించదా..?

అలానే టీడీపీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు బాలకృష్ణ ఒక బహిరంగ సమావేశంలో ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడాడు. "అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి.. లేకుంటే కడుపు అయినా చెయ్యాలని" పబ్లిక్ గా బాలకృష్ణ మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూ-ట్యూబ్ లో సజీవంగానే ఉన్నాయని వాటిపై ఇప్పటివరకు బాలకృష్ణ ఎక్కడా ఖండన కూడా ఇవ్వలేదని వాటిపై కూడా చర్చలులేవన్నారు. లోకేష్ అమెరికా వెళ్ళి మహిళలతో నిస్సిగ్గుగా ప్రవర్తించినా, ఆ ఫోటోలు, వీడియోలపై కూడా ఎల్లో మీడియాలో ఎందుకు చర్చ పెట్టరు అని అడగాలన్నారు.

ఒక ఫేక్ వీడియోను, ఒక దొంగ వీడియోను సృష్టించి, దానిపై మీరే చర్చకు పెట్టి, బీసీ ఎంపీ అయిన నన్ను రకరకాలుగా హింస పెట్టడానికి టీడీపీ ప్రయత్నం చేసిందో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆలోచించాలన్నారు. ఇది కుల వివక్షకు, కుల దురహంకారానికి నిలువెత్తు నిదర్శనమని ఆరోపించారు. ఒక బీసీ ఎంపీ అయిన తనపై రచ్చ చేసిన చంద్రబాబు ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆ ఆడియో తనది కాదని గానీ, దొరికిన ఆ రూ. 50 లక్షలు తనవి కాదు అని, ఆ వ్యవహారానికి తనకు ఏ సంబంధం లేదు.. అని వెంకటేశ్వర స్వామి భక్తునిగా, కాణిపాకం వినాయకుడి గుడికి వచ్చి చంద్రబాబు ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు.

తనపై వచ్చిన వీడియో మీద ప్రమాణం చేస్తానని ఓటుకు కోట్లు కేసులో దొరికిన ఆడియో- వీడియో మీది కాదు అని చంద్రబాబు ప్రమాణం చేస్తే, నా రాజీనామా లేఖను, అక్కడే ఎడమ చేతితో మొహాన పడేసి వెళతానన్నారు. దమ్ముంటే ఈ ఛాలెంజ్ కు చంద్రబాబు అంగీకరించాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.

IPL_Entry_Point

టాపిక్