AP High Court CJ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్‌ ఠాకూర్ నియామకం-dheeraj singh thakur appointed as chief justice of ap high court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Dheeraj Singh Thakur Appointed As Chief Justice Of Ap High Court

AP High Court CJ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్‌ ఠాకూర్ నియామకం

HT Telugu Desk HT Telugu
Jul 25, 2023 05:54 AM IST

AP High Court CJ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్‌ సింగ్ ఠాకూర్‌ను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. కొలిజియం సిఫార్సులకు రాష్ట్రపతి అమోద ముద్ర వేయడంతో ఠాకూర్‌ నియామకంపై సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్ ఠాకూర్
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్ ఠాకూర్

AP High Court CJ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌‌ను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.దీంతో కొత్త సీజేఐ నియామకానికి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరును సిఫార్సు చేస్తూ జులై 5వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీచేసింది.

కొలిజియం సిఫార్సులపై రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ను సంప్రదించిన తర్వాత ఠాకూర్‌ నియామకానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ టీఎస్‌ ఠాకుర్‌గా సుపరిచితులైన జస్టిస్‌ తీరథ్‌సింగ్‌ ఠాకుర్‌‌కు తమ్ముడు. వీరి తండ్రి దేవీదాస్‌ ఠాకుర్‌ ప్రధానోపాధ్యాయుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు.ఆ తర్వాత న్యాయవాద వృత్తిపై మక్కువతో అంచెలంచెలుగా ఎదిగి హైకోర్టు న్యాయమూర్తిగా సైతం పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా, గవర్నర్‌గా కూడా పనిచేశారు.

జమ్మూకశ్మీర్‌కు చెందిన ధీరజ్‌ సింగ్ ఠాకూర్‌ 1964 ఏప్రిల్‌ 25న జన్మించారు.1989 అక్టోబర్‌ 18న దిల్లీ, జమ్మూకశ్మీర్‌ బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్‌ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

మరోవైపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ప్రశాంతకుమార్‌ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో మే 19 నుంచి ఆ స్థానం ఖాలీగా ఉంది. ఈ స్థానం భర్తీ చేయడానికి కొలీజియం జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ పేరును సిఫార్సు చేసింది. జమ్మూ కశ్మీర్‌ స్థానికత కలిగిన న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్నారు.

2022 జూన్‌ 10 నుంచి బాంబే హైకోర్టులో పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న కొలీజియం మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సిఫార్సు చేసినా అది ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో కొలీజియం ఆ సిఫార్సును రద్దు చేసి, ఈ నెల 5న ఆయన్ను ఏపీ హైకోర్టు సీజేగా నియమించాలని నిర్ణయించింది. తాజా నియామకంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ హైకోర్టుకు కూడా ప్రాతినిధ్యం లభించినట్లవుతుంది.

ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ సోదరులు జస్టిస్‌ టీఎస్‌ ఠాకుర్‌ 2009 నవంబర్‌ 17 నుంచి 2017 జనవరి 3 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. 2015 డిసెంబర్‌ 3 నుంచి పదవీవిరమణ చేసే వరకు భారత 43వ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. న్యాయస్థానాల్లో పెరిగిపోతున్న పెండింగ్‌ కేసుల మధ్య న్యాయమూర్తులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని గుర్తుచేస్తూ ఈయన 2016 ఏప్రిల్‌ 24న దిల్లీలో జరిగిన ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో కన్నీరు పెట్టుకోవడం కలకలం రేపింది.

IPL_Entry_Point