Andhra Pradesh : మీరు దేవుడికి కానుకగా ఏం ఇస్తారు? ఇక్కడ మాత్రం తేళ్లు ఇస్తారు-devotees offers scorpions to lord kondala rayudu in kurnool district kodumuru ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Devotees Offers Scorpions To Lord Kondala Rayudu In Kurnool District Kodumuru

Andhra Pradesh : మీరు దేవుడికి కానుకగా ఏం ఇస్తారు? ఇక్కడ మాత్రం తేళ్లు ఇస్తారు

Anand Sai HT Telugu
Aug 17, 2022 04:43 PM IST

దేవుడి దగ్గరకు వెళ్తే.. కొబ్బరి కాయ, మరికొంత పూజా సామగ్రి తీసుకెళ్తారు. ఎవరైనా ప్రత్యేకంగా మెుక్కుకుంటే సంబంధించిన కానుకలు సమర్పిస్తారు. కానీ ఏపీలో మాత్రం ఓ దేవాలయంలో తేళ్లను మాత్రమే దేవుడికి ఇస్తారు. అది కూడా చేతితో పట్టుకుని వెళ్తారు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా?

కొడుమూరు కొండల రాయుడు
కొడుమూరు కొండల రాయుడు

కొన్ని ఆచారాలు చూసేందుకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ అది వారి నమ్మకం. వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం. పూర్వికులు చేశారు. ఇప్పటి వాళ్లు ఫాలో అయిపోతారు. ఎందుకు, ఏమిటి అనే విషయాలు పక్కనబెడితే అలా చేస్తే మంచి జరుగుతుందని వారి విశ్వాసం. ఇదంతా ఎందుకు చెప్పడమంటే.. కర్నూలు జిల్లాలోనూ ఓ వింత ఆచారం ఉంది. తేళ్లను దేవుడికి కానుకగా సమర్పిస్తారు. తాము అనుకున్నది జరగాలంటే.. ఈ పద్ధతే కరెక్ట్ అంటున్నారు భక్తులు.

ట్రెండింగ్ వార్తలు

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో కొండల రాయుడు(వెంకటేశ్వర స్వామి) చాలా ఫేమస్. ఇతర దేవాలయాల్లో చూసిన పద్ధతి ఇక్కడ ఉండదు. ఇక్కడి సంప్రదాయం కాస్త కొత్తగా, వింతగా అనిపిస్తుంది. కానీ అది భక్తుల నమ్మకం. ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. కర్నూలు జిల్లా ప్రజలు, ఇతర ప్రాంతాల వారు కోడుమూరులోని కొండ్రాయి కొండకు చేరుకుంటారు. అక్కడ ఎటు చూసినా.. భక్తులు ఏదో వెతుకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏదో పడిపోయిందని మీరు అనుకుంటే పొరబడినట్టే. వాళ్లంతా తేళ్ల కోసం వేతుకుతుంటారు.

కొండమీద ఉన్న చిన్న చిన్న రాళ్లను పైకి లేపి తేళ్లను పట్టుకుంటారు. అదేంటో మరి.. అక్కడ చాలా తేళ్లు ఉంటాయి. విచిత్రంగా ఉంది కదా. నేరుగా చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఆ ప్రాంతంలోని వారికి ఇదంతా కామన్. శ్రావణమాసం మూడో సోమవారం రోజున కొండపైకి వెళ్తారు. కొండలరాయుడిని దర్శించుకుంటారు. స్వామివారికి కానుకగా తేళ్లను సమర్పిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే ఇక్కడ ప్రత్యేకత.

తేళ్ల కోసం కొండమీద అంతా తిరుగుతారు. ఏ రాయిని తీసినా.. చాలు తేళ్లు కనిపిస్తాయి. ఎవరికి నచ్చిన దగ్గరకు వారు వెళ్లి వాటిని చేతితో పట్టుకుంటారు. మరి కుడితే అని మనసులో ఆలోచన వచ్చిందా? కొండలరాయుడి కొండపై అదే స్పేషల్. ఏ తేలు ఎవరినీ ఏం అనదు. చాలా ఏళ్లుగా ఇక్కడ తేళ్లను స్వామి వారికి సమర్పించడం ఆచారంగా వస్తుంది. చేతులతో పట్టుకొని గుడిలోకి వెళ్తారు. మూల విరాట్ పై వదులుతారు. ఆ తర్వాతే పూజలు చేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఎవరిని అడిగినా.. తేళ్లు తమను ఏం అనవు అనే చెబుతున్నారు. అనుకోకుండా తేలు కుడితే.. గర్భగుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి బాధ ఉండదట.

ఈ విషయం గురించి తెలిసిన చాలామంది చూసేందుకు వెళ్తున్నారు. తేళ్లు ఎవరినీ ఏం అనకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ తేళ్లంటే కొండలరాయుడికి చాలా ఇష్టమట. మనసులో భక్తితో ఏ రాయిని పైకి లేపినా తేళ్లు ఉంటాయని భక్తులు చెబుతున్నారు. చాలా ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుండటంతో అలా ఫాలో అయిపోతున్నారు. తేళ్లను కానుకగా ఇస్తే స్వామివారు తమ కోరికలను నెరవేరుస్తాడని అంటున్నారు భక్తులు.

IPL_Entry_Point