Delhi Liquor Scam : మాగుంట రాఘవకు 10 రోజుల కస్టడీ…
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని.. ఈడీ కోర్టులో హాజరుపరిచింది. రూ. వంద కోట్ల ముడుపుల్లో రాఘవ కీలకంగా వ్యవహరించారని వాదించిన ఈడీ.... మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాఘవను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు అనుమతించింది.
Delhi Liquor Scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.... ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ... మద్యం విధాన రూపకల్పనలో రూ. వంద కోట్లు చేతులు మారాయని పేర్కొంది. సౌత్‍గ్రూప్ పేరుతో వసూలు చేసి కీలక వ్యక్తుల ద్వారా పంపించారని తెలిపింది. మాగుంట రాఘవ రెడ్డికి... తయారీ, హోల్‍సేల్ వ్యాపారాలు ఉన్నాయని... 2 రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయని వెల్లడించింది. రూ.వంద కోట్ల ముడుపుల్లో రాఘవ కీలకంగా వ్యవహరించారన్న ఈడీ..... ఈ కేసులో శరత్ రెడ్డి, విజయ్‍నాయర్, అభిషేక్, సమీర్, అమిత్ అరోరా, బినోయ్ అరెస్టు అయ్యారని వివరించింది. రాఘవకు శరత్‍రెడ్దితో మంచి సంబంధాలు ఉన్నాయని... ముడుపుల సమీకరణలో సమీర్ మహేంద్రు కీలకంగా వ్యవహరించారని తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
బాలాజీ గ్రూపు యజమానిగా ఉన్న మాగుంట రాఘవకు... ఇండో స్పిరిట్ కంపెనీలో భాగస్వామ్యం ఉందని ఈడీ కోర్టుకి వివరించింది. మద్యం విధానంతో లబ్ది పొందేందుకు ముడుపులు ఇచ్చారని... ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని తెలిపింది. ఇప్పటికే దాఖలు చేసిన చార్జ్ షీట్లలో వివరాలు పొందుపరచామని పేర్కొంది. సుమారు 30 మంది సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని వివరించింది. ఇంకా రూ. 30 కోట్లకు సంబంధించిన వివరాలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ఇండో స్పిరిట్ కంపెనీ నుంచి రాఘవ మాగుంటకు వాటా వెళ్తోందని... మరిన్ని ఆధారాలు, వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపింది. ఈ మేరకు.. మాగుంట రాఘవను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది.
కాగా... అరెస్టు చేస్తూ వేసిన దరఖాస్తు కూడా తమకు ఇవ్వలేదని రాఘవరెడ్డి న్యాయవాది వాదించారు. అధికారం లేకుండా ఈడీ ఎలా అరెస్టు చేస్తుందని ప్రశ్నించారు. మేజిస్ట్రేట్ కస్టడీకి లేదా జ్యూడిషియల్ కస్టడికీ పంపాలని న్యాయస్థానాన్ని కోరారు. వారసత్వంగా వచ్చిన వ్యాపారం చేయడం తప్పెలా అవుతుందన్న రాఘవ రెడ్డి న్యాయవాది... ఈడీ తమపై తప్పుడు అంశాలను రుద్దుతోందని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ వాదనలను తిప్పికొట్టిన ఈడీ... నిందితులని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అధికారం ఉందని తెలిపింది. రాఘవను అరెస్టు చేస్తున్నట్లు ముందుగానే చెప్పామని ఈడీ న్యాయవాది కోర్టుకి వివరించారు. ఇరువురి వాదనలు నమోదు చేసిన న్యాయస్థానం… మాగుంట రాఘవకు కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో.. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చి బాబును కూడా ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల కస్టడీ ముగియడంతో.. బుచ్చిబాబుని కూడా ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది. ఇదే కేసుకు సంబంధించి తాజాగా ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఇక నిందితుల జాబితాలో మాత్రం 17 మంది పేర్లను పేర్కొంది. ఇందులో అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబుతో పాటు పలువురి పేర్లను వెల్లడించింది.ఈడీ దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈ కేసులోని నిందితులకు నోటీసులు కూడా జారీ చేసింది.