AP Assembly: నేను అలా అనలేదు… అమరావతిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు-cm ys jagan key comments on amaravati over three capitals for ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Ys Jagan Key Comments On Amaravati Over Three Capitals For Ap

AP Assembly: నేను అలా అనలేదు… అమరావతిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Sep 15, 2022 05:35 PM IST

ap assembly sessions 2022:టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన జగన్... అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని తీసేయాలని తాము అనలేదని అన్నారు. మూడు రాజధానిలో ఒకటి అమరావతిలోనే ఉంచుతామని చెప్పామని స్పష్టం చేశారు.

సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
సీఎం జగన్ (ఫైల్ ఫొటో) (facebook)

CM YS Jagan in AP Assembly: కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ మాట్లాడిన జగన్... కీలక ప్రసంగం చేశారు. అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రజా సంక్షేమానికి రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలు, పేదలకు పక్కా ఇళ్లు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ‘దోచుకో.. దాచుకో.. పంచుకో’ ఇదే నాటి టీడీపీ సిద్ధాంతమని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి 4 నుంచి లక్షల కోట్లు అవుతాయని చంద్రబాబే అన్నారని, ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున లక్షా 10 వేల కోట్లు.. అవసరం అవుతాయని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇందులో ఖర్చు చేసే పది శాతం డబ్బు విశాఖలో పెడితే ఎంతో అభివృద్ధి చేయవచ్చని చెప్పుకొచ్చారు.

నాకు కోపం లేదు…

'చంద్రబాబు రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. బినామీల పేరుతో అమరావతి భూములను లాగేసుకున్నారు. పెత్తందారి మనస్తస్త్వంతోనే పని చేస్తున్నారు. అమరావతిపై నాకు కోపం లేదు. రాజధానిగా తీసేయాలని నేను అనలేదు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పటం సరికాదు. అమరావతి గుంటూరు, విజయవాడకు దగ్గర లేదు. ఏ విధంగా అమరావతిని పూర్తి చేస్తామనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేసిన వారిపై 420 కింద కేసు పెట్టాలి. విశాఖ నెంబర్ 1 సిటీ. అన్ని రకాల వసతులు ఉన్నాయి. పది నుంచి పదిహేను వేల కోట్లు ఖర్చు పెడితే చాలా అభివృద్ధి అవుతుంది. విజయవాడ నగరానికి చంద్రబాబు ఏం చేశారు..?' అని సీఎం జగన్ ప్రశ్నించారు.

అమరావతి అనే ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదని... అక్కడ ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో బాగా ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అమరావతితో పాటు కర్నూలు, విశాఖలో రాజధాని ఉండాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు.

అమరావతిలో కేవలం 8కి.మీ పరిధిలో 53వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాలకు లక్షా 10వేల కోట్లు అవుతందనే విషయాన్ని చంద్రబాబు చెప్పారని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. రూ.5వేల కోట్లు పెట్టి ఇంకా లక్షా 5వేల కోట్లు ఖర్చు పెట్టాలంటే.. వందేళ్లకు రెండు, మూడింతల రెట్టింపు అవుతందన్నారు. అమరావతిలో బినామీ భూముల ధరలు పెరిగేందుకు విజయవాడ, మంగళగిరి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాకే రెండు ఫ్లైఓవర్‌లను పూర్తి చేశామని పేర్కొన్నారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

అగ్గిరాజేస్తున్నారు…

'అమరావతి నుంచి రైతులు అరసవెల్లి వెళ్లి దేవుడికి మొక్కడం ఏంటి..? ఆ ప్రాంతంలో అభివృద్ధి వద్దు అదంతా అమరావతిలో ఉండాలని మొక్కుతారట..?అక్కడి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే ఇలా చంద్రబాబు చేస్తున్నారు.మా ప్రాంతం అభివృద్ధి కావాలని ఉత్తరాంధ్ర దేవుడ్ని కోరుకోవడం ఏమిటి..?ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల కోసమే ప్రజలు- ప్రజలు కొట్టుకోవాలని అగ్గిరాజేస్తున్నారు. అన్ని ప్రాంతాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే వికేంద్రీకరణ విధానం తీసుకువస్తున్నాం. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర రాజధానుల వరకూ వైసీపీ ప్రభుత్వానిది ఇదే విధానం. నేను ఈ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకిని కాను. కాబట్టే మూడు రాజధానుల్లో ఒకటి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. ప్రజల ఆమోదంతోనే కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల్లోని 33 సీట్లలో 29 సీట్లను వైసీపీ గెలుచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. అన్ని ఎన్నికల్లోనూ టీడీపీకి కేవలం 2 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. వికేంద్రీకరణ అనేది ఓ మంత్రంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది' - అసెంబ్లీలో సీఎం జగన్

సీఎం జగన్ ప్రసంగం తర్వాత శాసనసభను స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం