వై.ఎస్.షర్మిల ఏపీ కాంగ్రెస్‌కు ఊపిరి పోయగలరా..?-can ys sharmila empower and rejuvenate ap congress an analysis from peoples pulse research ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Can Ys Sharmila Empower And Rejuvenate Ap Congress An Analysis From Peoples Pulse Research

వై.ఎస్.షర్మిల ఏపీ కాంగ్రెస్‌కు ఊపిరి పోయగలరా..?

HT Telugu Desk HT Telugu
Dec 22, 2023 12:05 PM IST

‘రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు ఏపీ జనాకర్షణ నేత దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్‌ షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారంతో ఆ పార్టీ సానూభూతిపరులు ఆమెను ఒక ఆశాకిరణంలా చూస్తున్నారు..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రాజకీయ పరిశోధకులు ఐ.వి.మురళీ కృష్ణ శర్మ అందిస్తున్న విశ్లేషణ.

వైఎస్ఆర్‌టీపీ అధినేత వై.ఎస్.షర్మిల
వైఎస్ఆర్‌టీపీ అధినేత వై.ఎస్.షర్మిల (PTI)

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్‌ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్‌ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది.

ట్రెండింగ్ వార్తలు

దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పునర్వైభవంపై ఆశలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు ఏపీ జనాకర్షణ నేత దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్‌ షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారంతో ఆ పార్టీ సానూభూతిపరులు ఆమెను ఒక ఆశాకిరణంలో చూస్తున్నారు.

నోటాతో పోటీ

కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందనే ఆక్రోశంతో ఏపీ ప్రజలు ఆ పార్టీని పాతాళానికి తొక్కేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2.8 శాతం, పార్లమెంట్‌ ఎన్నికల్లో 2.86 శాతం, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1.17 శాతం, పార్లమెంట్‌ ఎన్నికల్లో 1.31 శాతం ఓట్లతో, ఈ నాలుగు ఎన్నికల్లోనూ ఒక్క స్థానం కూడా సాధించకుండా నోటాతో పోటీపడే పరిస్థితి వచ్చింది.

రాష్ట్రంలో ఉనికి కోల్పోయి వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు వై.ఎస్‌.షర్మిల జీవం పోస్తారా అనే చర్చ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. వైఎస్‌ఆర్‌ మరణానంతరం రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాలతో ఆయన కుటుంబం కాంగ్రెస్‌ పార్టీకి దూరమైంది. ఉమ్మడి ఏపీకి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అరెస్టు కావడం, అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలతో వైఎస్‌ఆర్‌ కుటుంబం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ స్థానాన్ని జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీ భర్తీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారడంతో ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైఎస్‌ఆర్‌సీపీ ఒక దిక్సూచిలా కనిపించింది. కాంగ్రెస్‌లోని బడా నేతలు మొదలుకొని కింద స్థాయి కార్యకర్తల వరకు వైఎస్‌ఆర్‌ జగన్మోహన్‌రెడ్డి పంచన చేరడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఖాళీ అయ్యింది.

వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్‌ స్థానాన్ని భర్తీ చేసిందని చెప్పడానికి 2014లో జరిగిన నందిగామ ఉప ఎన్నికే ఉదాహరణ. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో సానుభూతితో వైఎస్‌ఆర్‌సీపీ పోటీ చేయకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థికి పరోక్షంగా మద్దతిచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 2.5 శాతం ఓట్లు పొందితే, నాలుగు నెలల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ 19.55 శాతం ఓట్లు సాధించింది. ఇక్కడ వైఎస్‌ఆర్‌టీపీ, కాంగ్రెస్‌ మధ్య జరిగిన ఓట్ల బదిలీని పరిశీలిస్తే ఈ రెండు పార్టీల ఓటర్లు ఒకరేనని చెప్పవచ్చు.

టీడీపీకి ప్రత్యర్థిగా ఉంటున్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా వైఎస్‌ఆర్‌సీపీని రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో పీపుల్స్‌పల్స్‌ సంస్థ బృందం పర్యటించినప్పుడు ‘వైఎస్‌ఆర్‌సీపీ’, ‘కాంగ్రెస్‌’ రెండూ ఒకే పార్టీ అని ప్రజలు ఇప్పటికీ భావిస్తుండడం కనిపించింది. అంతేకాక రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ‘రాజశేఖరరెడ్డి అంటే కాంగ్రెస్‌ అని, కాంగ్రెస్‌ అంటే రాజశేఖరరెడ్డి’ అనే అనుకుంటున్నారు.

ఏపీలో సత్తా చూపుతారా?

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో విభేదించిన ఆయన సోదరి షర్మిల తన రాజకీయ ఎదుగుదల కోసం మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేసి విఫలమయ్యారు. 2021లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి రోజున నూతన పార్టీ స్థాపించి రాష్ట్రంలో 3800 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించకున్నా, తెలంగాణ ప్రజల హృదయాలలో మాత్రం ఆమె చోటు సంపాదించుకోలేక పోయారు. తెలంగాణలో రాజకీయంగా వైఫల్యాన్ని గుర్తించిన షర్మిలా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నా, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సమ్మతించకపోవడంతో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించి తెలంగాణలో రాజకీయాలకు దాదాపు స్వస్తి పలికారు. ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని కోరుకున్నా కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం షర్మిల సేవలు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ అవసరమని గుర్తించింది.

ఏపీలో పార్టీ ఉనికినే కోల్పోవడంతో తిరిగి పట్టు సాధించడానికి షర్మిలను ఒక బాణంగా ఉపయోగించుకోవాలని, ఆమెకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం చూస్తోంది. అయితే పార్టీ భావిస్తున్నట్టు షర్మిల ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేగలరా అనేది సందేహమే.

షర్మిల వ్యూహాలను గమనిస్తే రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని ఆమె మరోసారి నిరూపించారు. వైఎస్‌ఆర్‌ అంటే ఆదరాభిమానాలున్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రధానంగా రాయలసీమ ప్రాంతాన్ని వదిలేసి తెలంగాణ కోడలిని అంటూ ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం షర్మిల రాజకీయ తప్పిదం. ఇంతకాలం తెలంగాణ కోడలిని అంటూ ఆ ప్రాంతంలో రాజకీయాలు చేసిన ఆమెను ఇప్పుడు ఆంధ్ర ప్రజలు తమ బిడ్డగా ఆదరిస్తారా అంటే ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యం కాదు. తెలంగాణలో పాదయాత్ర సందర్భంగా వార్తలలో ప్రముఖంగా నిలవడానికి షర్మిల కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆమె ఏపీలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

తెలంగాణలో లాగే ఏపీలో కూడా మంచి రోజులొస్తాయని ఆశించడమే తప్పా, రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలు శూన్యం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రఘువీరారెడ్డి, శైలజానాథ్‌, గిడుగు రుద్రరాజు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. పార్టీ బాగుకు రాష్ట్ర అగ్రనేతలు చిత్తశుద్ధితో పనిచేయడంలేదని దిగువస్థాయి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుత పార్టీ చీఫ్‌ రుద్రరాజు విషయాన్నే తీసుకుంటే ఏదైనా అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే ‘‘నాకు తెలుసు కదా అన్నా....ఎన్ని చూడలేదు...నాకు వదిలిపెట్టండి...’’ అంటూ ఒక ఊతపదంలా మాట్లాడుతారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే వ్యాఖ్యలు ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్‌లో పల్లంరాజు, జేడీ శీలం, కొప్పుల రాజు, బాపిరాజు, కేవీపీ, సుబ్బిరామరెడ్డి వంటి ప్రముఖ నేతలు గత చరిత్రను వల్లె వేసుకుంటూ, సభలు, సమావేశాలకే పరిమితమయ్యారనే విమర్శ పార్టీలో ఉంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్న అంశమని, రిజర్వుడ్‌ స్థానాల్లో కూడా 20 నుండి 25 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉన్న పరిస్థితులలో ఔత్సాహికులకు ఆర్థికంగా సాయపడడానికి ఇంతకాలం పార్టీ పేరుతో పదవులు అనుభవించిన అగ్రనాయకులు ఎవరూ ముందుకు రావడంలేదనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో నెలకొని ఉంది. 2012లో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో సత్తా చాటుకున్న వైఎస్‌ఆర్‌సీపీ 2014 ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్‌ జాతీయ, రాష్ట్ర అగ్రనేతలు పార్టీ అభివృద్ధికి క్షేత్రస్థాయి నుండి చర్యలు తీసుకొని ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని కాంగ్రెస్‌ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

విభజన అంశాలే ఆయుధంగా

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావిత అంశాలు వేరేగా ఉంటాయి. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండడంతో, రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర విభజన హామీల అంశంలో మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందనే భావనతో ఉన్న ప్రజలు కాంగ్రెస్‌వైపు కొంత మొగ్గు చూపే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్‌ క్షేత్రస్థాయి అధ్యయనంలో తేలింది. అయతే దీనిని కాంగ్రెస్‌ ఎంతమేరకు అందిపుచ్చుకుంటుందనేది ప్రశ్నార్థకమే.

కాంగ్రెస్‌ అధిష్టానం షర్మిలకు రాష్ట్రంలో పూర్తి బాధ్యతలు అప్పగించినా వంద రోజులలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఏదో అద్భుతం సృష్టిస్తారనుకోవడం అత్యాశే. వైఎస్‌ఆర్‌ కూతురిగా ప్రజలు ఆమెను ఆదరిస్తే వ్యక్తిగతంగా ఆమె గెలుపుతో పాటు పార్టీకి ఓట్ల శాతం పెరగవచ్చు. ఆమె 2024 ఎన్నికలే లక్ష్యంగా కాకుండా దీర్ఘకాలిక కృషి చేస్తే కనీసం 2029 ఎన్నికలకైనా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రధాన పోటీలో నిలిచే అవకాశాలుంటాయి.

రాబోయే ఎన్నికలనే లక్ష్యంగా చేసుకొని పగ్గాలు చేపడితే మాత్రం తెలంగాణలో విఫలమైనట్టే షర్మిల మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో విఫల నాయకురాలిగా మిగిలిపోవాల్సి వస్తుంది. తెలంగాణలో తొమిదిన్నరేండ్లు కేసీఆర్‌పై పోరాడి, 2018లో దాదాపు 18 ఓట్ల శాతం వెనకబడిన కాంగ్రెస్‌ 2023లో బీఆర్‌ఎస్‌ను మట్టికరిపించిన విధానాన్ని ఏపీ కాంగ్రెస్‌ స్ఫూర్తిగా తీసుకుంటే రాష్ట్ర పార్టీలో ఉత్సాహాన్ని నింపడం ఖాయం.

కాంగ్రెస్‌ సానుభూతిపరులు కోరుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పూర్వవైభవం రావాలంటే రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ పూర్తిగా పడిపోవాలి. ఎన్నికల సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీలో ఏర్పడే అసంతృప్తి నేతలను కాంగ్రెస్‌ చేరదీసి అనుకూలంగా మల్చుకోవాలి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అధిష్టానం ‘ఇండియా’ కూటమి పేరుతో పలు పార్టీలతో జతకడుతోంది. తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పలువురిని కలుపుకొని విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కూడా ఈ ఉదంతాలను అనుసరిస్తూ రాష్ట్రంలోని భావసారూప్యత గల పార్టీలతో, ప్రజాసంఘాలతో జతకలిస్తే భవిష్యత్తులో టీడీపీకి ప్రత్యర్థిగా వైఎస్‌ఆర్‌సీపీ స్థానాన్ని కాంగ్రెస్‌ భర్తీ చేసే అవకాశాలుంటాయి.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు వ్యాసకర్త, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హిందుస్తాన్‌టైమ్స్‌వి కావు)

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్
ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్
IPL_Entry_Point