YS Sharmila : బీఆర్ఎస్ నేతలపై మహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు-ysrtp president sharmila complaints to telangana women commission on brs leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ysrtp President Sharmila Complaints To Telangana Women Commission On Brs Leaders

YS Sharmila : బీఆర్ఎస్ నేతలపై మహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 04:25 PM IST

YS Sharmila : ఎమ్మెల్యే శంకర్ నాయక్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర మహిళా కమిషన్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫిర్యాదు చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాదయాత్రను ఆపడంపై హైకోర్టుకి వెళతానని షర్మిల తెలిపారు.

మహిళా కమిషన్ కు ఫిర్యాదు
మహిళా కమిషన్ కు ఫిర్యాదు (twitter)

YS Sharmila : బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో గవర్నర్ స్థాయి నుంచి మహిళా రైతుల వరకు ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని... రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న తనపైనా వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల... బీఆర్ఎస్ నేతలు వాళ్ల ఇంట్లో మహిళలపైనా ఇలానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించారు. పాదయాత్ర ఆపడంపై హైకోర్టుకి వెళ్తానని స్పష్టం చేశారు.

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసేందుకు మూడు నాలుగు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నామని.. షర్మిల చెప్పారు. కానీ.. ఛైర్మన్ అందుబాటులోకి రాలేదని.. సోమవారం వర్కిండ్ డే అయినా.. ఛైర్మన్ రాలేదని వివరించారు. దీంతో... కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు అందించాల్సి వచ్చిందని చెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకోకపోతే... జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తామని... బీఆర్ఎస్ నేతలపై జాతీయ స్థాయిలో కంప్లైంట్ చేస్తామని అన్నారు.

పాదయాత్రలో ఎక్కడా కూడా తాను రెచ్చగొట్టేలా మాట్లాడలేదన్నారు షర్మిల. బీఆర్ఎస్ నాయకులే శాంతి భద్రతల సమస్య సృష్టించి పాదయాత్రను ఆపారని ఆరోపించారు. తాను 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నానని చెప్పారు. మరదలు, షికండి అని అంటున్నారని... నల్లిని నలిపేసినట్లు నలిపేస్తామని బెదిరిస్తున్నారని... అడుగు ఎలా బయటపెడతావో చూస్తా అని హెచ్చరిస్తున్నారని అన్నారు. ఒక మహిళ పట్ల ఇలాగేనా మాట్లాడేది అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య భూ కబ్జాలకు పాల్పడుతున్నారని... కేసీఆర్ కూతురు కవిత మద్యం కుంభకోణంలో ఉన్నారని షర్మిల ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోకుండా... ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. బూటకపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు వైఎస్ షర్మిల. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములు అనేవి మిగలకుండా కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల అన్యాయాలపై పోరాటానికి రాష్ట్రంలోని మహిళలు ఏకమవ్వాలని షర్మిల పిలుపునిచ్చారు. అంతా ఒకతాటిమీదకు వచ్చి బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point