Organ Donors : తెలంగాణలో అవయయవ దాతలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు....
Organ Donors తెలంగాణ అవయవదాతలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు పేదింటి పిల్లలకు ప్రత్యేక క్యాటగిరీలో గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. అవయవదానం ప్రాధాన్యతను పెంచడానికే ఆరోగ్యశాఖ ఈ ఆలోచన చేస్తోంది.
Organ Donors : అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అవయవాలను దానం చేయడానికి ప్రజలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించడానికి వైద్యఆరోగ్య శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. తెలంగాణలో అవయవదానం చేసే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రతిపాదను ముఖ్యమంత్రికి పంపారు. అవయవదానం ప్రాధాన్యతను ప్రజలు గుర్తించేలా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవయవదానం చేసే సమయంలో వేగంగా వాటిని తరలించేందుకు హెలికాఫ్టర్ సేవల్ని వినియోగించుకోనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రతిజిల్లాలో అవయవదానంపై అవగాహన క్యాంపులు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలకు శిక్షణనిస్తున్నాయి. తెలంగాణలో అవయవదానం కార్యక్రమాలకు నోడల్ కేంద్రంగా గాంధీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో 9 ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ థియేటర్లను సిద్ధం చేశారు.
వైద్య రంగంలో ఆధునిక ఆవిష్కరణలు, శస్త్ర చికిత్సలు అభివృద్ధి చెందినా అవయవాల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. కిడ్నీ, లివర్, గుండె వంటి అవయవాలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వాటిని యంత్రపరికరాలతో భర్తీ చేసే పరిస్థితి లేదు. రోగుల ప్రాణాలను కాపాడటానికి జీవన్మృతుల అవయవాలను సేకరించడం, బతికున్న వారి నుంచి వాటిని సేకరించడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోంది. చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి నుంచి అవయవాలను సేకరించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి అమరుస్తున్నారు. ఇక అవయవదానంలో అక్రమాలు ఎక్కువగా జరుగుతుండటంతో అవసరమైన వారి కోసం జీవన్ దాన్ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా రోగులకు అందించే ఏర్పాటు చేస్తోంది. ప్రమాదాల్లో గాయపడి కోలుకోలేని స్థితిలో ఉన్న వారి అవయవాలను ఇతరులకు మార్పిడి చేసేందుకు జీవన్‌దాన్ ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.
బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి గుండె, లివర్, కిడ్నీ ఊపిరితిత్తులు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను సేకరించి ఇతరులకు అమరుస్తున్నారు.
2013లో ప్రారంభించిన జీవన్‌దాన్ ద్వారా ఇప్పటి వరకు తెలంగాణలో 1142 మంది నుంచి 4316 అవయవాలను అవసరమైన వారికి మార్పిడి చేశారు. ఇప్పటికీ మరో 3180మంది అత్యవసర పరిస్థితుల్లో అవయవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురు చూస్తున్నారు. కరోనా తర్వాతి కాలంలో అవయవ దానం చేసే వారు తగ్గడంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి అవయవాలు సేకరించేందుకు సహకరిస్తున్న కుటుంబాలకు చేతులెత్తి మొక్కాలని మంత్రి హరీష్ రావు అన్నారు. పుట్టెడు దు:ఖంలోను అవయవ దానానికి ఒప్పుకుని మరికొందరికి సాయపడుతున్న వారు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. అవయవదానం చేసే కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
టాపిక్