Teachers Transfers Cancelled: హైకోర్టు ఆదేశాలతో టీచర్ల బదిలీల షెడ్యూల్ రద్దు-telangana teachers transfers and promotions schedule cancelled with high court interim orders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Teachers Transfers Cancelled: హైకోర్టు ఆదేశాలతో టీచర్ల బదిలీల షెడ్యూల్ రద్దు

Teachers Transfers Cancelled: హైకోర్టు ఆదేశాలతో టీచర్ల బదిలీల షెడ్యూల్ రద్దు

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 09:36 AM IST

Teachers Transfers Cancelled: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మరింత జాప్యం కానున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బదిలీలు, ప్రమోషన్ జాబితాలను ప్రకటించ వద్దని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కోర్టు తీర్పును సవాలు చేయాలని యోచిస్తోంది.

తెలంగాణలో ఈ ఏడాది టీచర్ల బదిలీలు లేనట్టే....
తెలంగాణలో ఈ ఏడాది టీచర్ల బదిలీలు లేనట్టే....

Teachers Transfers Cancelled తెలంగాణలో కోర్టు తీర్పుతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ రద్దైంది. తాజా ఉత్తర్వులతో బదిలీ ప్రక్రియ మరింత జాప్యం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలకు సీనియారిటీ జాబితాతో పాటు ప్రమోషన్ల కోసం తాత్కలిక సీనియారిటీ జాబితాను మంగళవారం విడుదల చేయాల్సి ఉంది.

కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జాబితాలను విడుదల చేయొద్దని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన, ఆర్జేడీలు, డీఈఓలను ఆదేశించారు. జిల్లాల్లో ఉపాధ్యాయుల ఖాళీలను కూాడా ప్రకటించొద్దని ఆదేశించారు. స్థానికత కాకుండా సర్వీస్ సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేపడుతూ జీవో 317 జారీ చేశారు. దీని ద్వారా 25వేల మందిని ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. బదిలీలు చేయడానికి ముందు ఉమ్మడి జిల్లాల్లోని పాఠశాలల్లో పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని కొందరు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

హైకోర్టు తీర్పుతో తెలంగాణలో టీచర్ల బదిలీ ప్రక్రియకు మళ్ళీ బ్రేక్‌ పడింది. ఇప్పటికే సగం పూర్తైన షెడ్యూల్‌ను మధ్యలోనే నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విడుదల చేయాల్సిన సీనియారిటీ జాబితాను తక్షణమే నిలిపివేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

317 జీవో ద్వారా కొత్త జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు బదిలీల్లో అవకాశం లేకుండా, రెండేళ్ళ కనీస సర్వీసు నిబంధన పెడుతూ విద్యాశాఖ ఇటీవల జీవో ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది టీచర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి 11 గంటల వరకూ చర్చలు జరిపారు.

కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వానికి తెలియ చేయడంతో బదిలీ ప్రక్రియ నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. కోర్టు తీర్పు తుది కాపీ ఇంకా అందలేదని, మంగళవారం కాపీ వచ్చిన తర్వాత తీర్పుపై అప్పీలుకు వెళ్ళడమా? తీర్పును అమలు చేయడమా? అనేది ఆలోచిస్తామని పాఠశాల విద్య ఉన్నతాధికారి తెలిపారు.

ఈ ఏడాదికి బదిలీలు లేకపోవచ్చు….

కోర్టు తీర్పు ప్రకారం కొత్త జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని అధికారులు చెబుతున్నారు. బదిలీ అవకాశం లేని టీచర్లు దాదాపు 25 వేల మంది ఉన్నారు . కోర్టు తీర్పుకు అనుగుణంగా వెళ్ళాలంటే కొత్తగా షెడ్యూల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. బదిలీ ప్రక్రియకు అనుసరించే సాఫ్ట్‌వేర్‌ మొత్తం మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. 317 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు ఉమ్మడి జిల్లాలోని సీనియారిటీ మళ్ళీ లెక్కగట్టాలి. ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గత నెల 28న మొదలైంది. దాదాపు 59 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి అవకాశం కల్పిస్తే జాబితాను మళ్లీ మార్చాల్సి ఉంటుంది. కొత్తగా మరో 15వేల మంది బదిలీలకు దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.

IPL_Entry_Point