TSRTC Special Discounts: గుడ్ న్యూస్.. ముందస్తు టికెట్ల రిజర్వేషన్లపై ఆర్టీసీ డిస్కౌంట్స్
TSRTC Offers: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
TSRTC Latest News Updates: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ప్రత్యేక ఆఫర్లతో పాటు సులువైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముందస్తుగా టికెట్లను రిజర్వేషన్ చేసుకునే వారికి భారీగా ఆఫర్లను ప్రకటించింది.
31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్‌పై 5 శాతం రాయితీ కల్పించనుంది టీఎస్ఆర్టీసీ. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే పది శాతం రాయితీని ప్రకటించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీస్‌లకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే తాజాగానే మరో సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్టీసీ. వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ పేరుతో నూతనంగా ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణలోని 99 ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘AM 2 PM’ ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు 9154680020 ఫోన్ నంబర్‌ను కానీ.. టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ అధికారిక వెబ్‌సైట్ www.tsrtcparcel.in ను సంప్రదించవచ్చు. ‘AM 2 PM’ ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుంది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ కొరియర్ ధర రూ.99గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.