TRS Harish Rao : మునుగోడులో బీజేపీ దివాళాకోరు రాజకీయాలు… హరీష్ రావు
TRS Harish Rao మునుగోడులో బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మునుగోడు బహిరంగ సభ విజయవంతం కావడం బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదన్నారు. పార్టీ ఫిరాయింపులకు, విలీనాలకు తేడా తెలియకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, పార్టీ మార్పులు రాజ్యాంగంలో ఏమి ఉందో చదువుకోవాలని సూచించారు. బీజేపీ మాదిరి ప్రభుత్వాలను కూల్చి ఇతర పార్టీ నేతల్ని టిఆర్‌ఎస్ చేర్చుకోలేదన్నారు.
TRS Harish Rao పార్టీ ఫిరాయింపులపై నీతులు చెబుతున్న బీజేపీ నాయకులు రెండేళ్లుగా వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదు మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దేశంలో రాజకీయాలను భ్రష్టు పట్టించిందని బీజేపీయేనని హరీష్ రావు ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో దౌర్జన్యంగా ఎమ్మెల్యేలను చేర్చుకున్న చరిత్ర బీజేపీదని హరీష్ ఆరోపించారు.
తెలంగాణలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలిన ఘనత కేసీఆర్‌దని హరీష్ రావు చెప్పారు. నాలుగేళ్లలో ఇంటింటికి తాగునీరు అందించామన్నారు. మునుగోడులో కేసీఆర్ సభ విజయవంతం కావడంతో బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇద్దరు నాయకులు నకిలీ మకిలీ చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. స్థాయి, రాజ్యాంగ పదవి స్థాయిలు మరచి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. గంటకొకరు నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆరోపించారు. పదవిలో ఉన్నవారు వివరాలు తెలుసుకుని మాట్లాడాలని, గల్లీ స్థాయికి పడిపోయిచిల్లర మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. బీజేపీలో బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు అంత స్థాయి లేదని, ఢిల్లీ దూతలు చెప్పిన సంగతి మరచిపోయారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, సంజయ్‌లు బీజేపీలో ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేలా మాట్లాడితే సహించేది లేదన్నారు.
ఏపీలో బీజేపీ దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడేప్పుడు బాధ్యతగా మాట్లాడాలన్నారు. బండి సంజయ్ జిఎస్టీ, నీటి మీటర్ల మీద మాట్లాడిన దాంట్లో ఒక్క వాస్తవం లేదన్నారు. ఎనిమిదేళ్లలో మునుగోడులో 99శాతం ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం అందిందన్నారు. అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందుతున్నాయని చెప్పారు. గతంలో మునుగోడు అక్కా చెల్లెళ్ల భుజాలు కాయలు కాచేవని, ఎల్బీనగర్ నుంచి నీళ్ల క్యాన్ వస్తే ప్రతి చుక్క దాచుకుని తాగే పరిస్థితి ఉండేదని, నాలుగేళ్లుగా ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. కేసీఆర్ రాకముందు మునుగోడులో పరిస్థితి ఏమిటన్నారు. తాము చెప్పింది నిజమైతే మునుగోడు ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాతా పెడతారన్నారు.
ముునుగోడులో టిఆర్‌ఎస్ వల్ల రైతుబంధు, ఆసరా పెన్షన్, కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్స్, షాదీముబారక్, 24 గంటల ఉచిత విద్యుత్ అందుకుంటే బీజేపీ వల్ల రూ.400సిలిండర్ రూ.1200 చేశారని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్‌ది పంచుడు నినాదం అయితే బీజేపీది పెంచుడు నినాదమన్నారు. నియోజక వర్గంలో 1,01,279మంది రైతులకు మునుగోడులో రైతు బంధు ద్వారా ప్రయోజనం చేరిందన్నారు. మునుగోడులోనే 131కోట్ల రుపాయల రైతు బంధు పంచామని, 40వేల ఆసరా పెన్షన్లు మునుగోడులో ఇస్తున్నారని, 1200మందికి పైగా రైతు బీమా చెల్లించినట్లు హరీష్ రావు చెప్పారు
తమ పార్టీ ఎమ్మెల్యేలు వందల కోట్లు ఆశ చూపినా, వాటిని గడ్డి పోచలా డబ్బు వదులుకున్నారని చెప్పారు. పార్టీలో చేరికల గురించి బీజేపీ మాట్లాడితే దెయ్యల వేదలు వల్లించినట్లు అన్నారు. ఈడీ,బోడీలను చూపించి బెదిరించి ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర బీజేపీదన్నారు. పార్లమెంటులో సిఎం రమేష్, టీజీవెంకటేష్, గరికపాటి, సుజనాచౌదరిలను చేర్చుకుని విలీనం చేసుకోవడాన్ని ఎలా సమర్ధించుకోంటారని ప్రశ్నించారు.
రఘురామకృష్ణం రాజు మీద రెండేళ్లుగా ఉన్న ఫిర్యాదు ఎందుకు పెండింగ్‌లో ఉందన్నారు. రెండేళ్ళుగా రఘురామ మీద ఎందుకు అనర్హత వేటు వేయలేదన్నారు. గుజరాత్‌లో 8మంది, సిక్కింలో 13మందిని బీజేపీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక, సిక్కిం, మహారాష్ట్ర, మణిపూర్ సమా ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హత్య చేసి గద్దెనెక్కిన చరిత్ర బీజేపీదన్నారు. దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి మాట్లాడే హక్కు ఎక్కడిదన్నారు.
మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెబితేనే తాము పెడుతున్నారన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులతోనే బావులు, బోర్లకు మీటర్లు పెడుతున్నామన్నారు. కేంద్రం నిబంధనలకు అనుగుణంగానే ఐదేళ్లలో రూ.30వేల కోట్ల నిధులు ఇస్తామనే హామీతోనే మీటర్లు పెడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే పూర్తి మార్కులు వేస్తామని ఆర్ధిక శాఖ తెలిపిందని, కోటా విధించి తక్కువ కరెంటు వాడుకునే రైతులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించినట్లు హరీష్ రావు లేఖలు బయటపెట్టారు..
టాపిక్