Sharmila padayatra: షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి-telangana high court gives permission to sharmila padayatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana High Court Gives Permission To Sharmila Padayatra

Sharmila padayatra: షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

HT Telugu Desk HT Telugu
Dec 13, 2022 06:21 PM IST

High court permits YS sharmila padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజకీయ నేతలందరూ పాదయాత్ర కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి (ANI)

High court permits YS Sharmila padayatra: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు (YS Sharmila) తెలంగాణ హైకోర్టులో (TS High Court) ఊరట లభించింది. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్రకు న్యాయస్థానం అనుమతించింది. పాదయాత్రకు గతంలోనే అనుమతి ఇచ్చామని గుర్తుచేసింది. అయినా పోలీసులు షర్మిల యాత్రకు అడ్డుచెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. గతంలో ఇచ్చిన షరతులు గుర్తుంచుకోవాలని షర్మిలకు సూచించిన కోర్టు.. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని ఆదేశించింది. రాజకీయ నేతలందరూ పాదయాత్ర కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) ఘటన తర్వాత షర్మిల పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నా పోలీసులు శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ అనుమతి నిరాకరించారు. అనుమతి కోరుతూ షర్మిల మరోసారి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించగా.. ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. షర్మిల తెరాస నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ అంశంలో గతంలో కోర్టు నిర్దేశించిన నిబంధనలను ఆమె అతిక్రమించారని తెలిపారు. గవర్నర్ ని కలిసిన తర్వాత రాజ్ భవన్ నుంచి బయటకొచ్చిన షర్మిల.. తెలంగాణను తాలిబన్ల రాష్ట్రంగా మార్తున్నారని వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ వాదనలపై స్పందించిన న్యాయస్థానం.. రాజ్‌భవన్ దగ్గర వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రకు ఎందుకు అనుమతి నిరాకరించారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోడం సాధారణం అని పేర్కొంది. యాత్రకు గతంలోనే అనుమతి ఇచ్చామని, అయినా పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టిన కోర్టు.. తాజాగా మరోసారి అనుమతులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన షరతులు గుర్తుంచుకోవాలని షర్మిలకు కోర్టు సూచించింది.

తెలంగాణలో షర్మిల చేస్తున్న పాదయాత్ర నర్సంపేటలో జరిగిన ఘటనతో ఆకస్మాత్తుగా నిలిచిపోయింది. స్థానిక ఎమ్మెల్యేపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే అనుచరులు షర్మిల వాహనాలను దగ్ధం చేశారు. దీంతో షర్మిల పాదయాత్రను నిలిపి ఆందోళనకు దిగారు. ఆ తర్వాత పోలీసులు షర్మిలను బలవంతంగా హైదరాబాద్‌ తరలించారు.

ఎమ్మెల్యే అనుచరులు వాహనాలను దగ్ధం చేయడంతో వాటిని కేసీఆర్‌కు చూపుతానంటూ షర్మిల పంజాగుట్ట చౌరస్తాలో హంగామా సృష్టించారు. తన బస్సుతో పాటు ధ్వంసమైన వాహనాలను ప్రగతి భవన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు షర్మిల అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నా పోలీసులు శాంతిభద్రతల సమస్యల పేరు చెప్పి అనుమతించడం లేదని ఆరోపిస్తూ.. హైదరాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పోలీసులు ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు. ప్రభుత్వం, పోలీసుల తీరుని నిరసిస్తూ.. ఇంటి వద్దే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. లోటస్‌ పాండ్‌లో తన ఇంటి ఎదుట రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఆమరణ దీక్ష చేపట్టి అస్వస్థతకు గురికావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంది సోమవారం డిశ్చార్జి అయ్యారు. వైద్యులు ఆమెను రెండు, మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రజా ప్రస్థాన యాత్రకు కోర్టు అనుమతించడంతో.. పూర్తిగా కోలుకున్న తర్వాత షర్మిల యాత్ర తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.

IPL_Entry_Point