Artificial Intelligence : అటవీ శాఖ స్మార్ట్ స్టెప్.. వన్యప్రాణుల సంరక్షణలో ఏఐ టెక్నాలజీ-telangana forest department to use artificial intelligence in wildlife conservation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Forest Department To Use Artificial Intelligence In Wildlife Conservation

Artificial Intelligence : అటవీ శాఖ స్మార్ట్ స్టెప్.. వన్యప్రాణుల సంరక్షణలో ఏఐ టెక్నాలజీ

HT Telugu Desk HT Telugu
Aug 11, 2022 02:37 PM IST

Telangana AI Mission : టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ అటవీ శాఖ ఓ స్మార్ట్ స్టెప్ తీసుకుంది. అదేంటంటే.. వన్యప్రాణుల సంరక్షణలో ఏఐ (AI) సాంకేతికతను ఉపయోగిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

Forest AI Grand Challenge : తెలంగాణ అటవీ శాఖ ఓ అడుగు ముందుకు వేసింది. వన్యప్రాణాలు సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తోంది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీ-ఎఐఎమ్) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ క్యాప్‌జెమినితో కలిసి ప్రారంభించిన ‘ఫారెస్ట్ ఏఐ గ్రాండ్ ఛాలెంజ్’ వన్యప్రాణుల సంరక్షణలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించవచ్చని నిరూపించింది.

ఏఐ టెక్నాలజీతో అడవి జంతువులను పట్టుకునే వేటగాళ్లను గుర్తించవచ్చు. అటవీ ప్రాంతాల్లో చెలరేగే కార్చిచ్చు వంటి ప్రమాదాలను గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. దీంతో వన్యప్రాణుల నష్టాన్ని నివారించవచ్చు. 'మేం తయారుచేసిన డేటా ద్వారా అటవీ అధికారులు జంతువుల పరిరక్షణకు, అడవిలో మంటలు అంటుకున్న ప్రదేశాలకు త్వరగా వెళ్లడానికి సహాయపడుతుంది. కెమెరా ట్రాప్ డేటా సమాచారాన్ని పెద్ద ఎత్తున సేకరించడం, ప్రాసెస్ చేయడంలో మా మోడల్‌లు ఉపయోగపడుతాయి. ఉపగ్రహ చిత్రాల నుండి డేటాతో దాన్ని ఏకీకృతం చేస్తాయి. ఇది శాకాహార, మాంసాహార వంటి వివిధ జాతుల స్పాటియో-టెంపోరల్ డెన్సిటీ మ్యాపింగ్‌ను మాకు అందిస్తుంది.' అని ఫారెస్ట్ AI గ్రాండ్ ఛాలెంజ్ విజేతగా ఎంపికైన మహారాష్ట్రకు చెందిన థింక్ ఎవాల్వ్ కన్సల్టింగ్ సీఈఓ, వ్యవస్థాపకుడు ఆకాష్ గుప్తా చెప్పారు.

తెలంగాణ అటవీ శాఖతో పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేసినందుకు క్యాప్‌జెమినీ నుంచి మెంటరింగ్ సపోర్ట్ రూ. 20 లక్షల వరకు అవార్డును అందుకుంది. 'అటవీ అధికారులు నీటి వనరుల్ని గుర్తించేందుకు, అడవుల్లో అక్రమంగా చెట్ల నరికివేతకు జరిగే ప్రయత్నాలను గురించి తెలుసుకునేందుకు సంబంధించిన ఒక స్టార్టప్‌ మోడల్‌ను ప్రదర్శించారు. పర్యావరణ టూరిజం కార్యకలాపాలను ప్లాన్ చేసేటప్పుడు అధికారులు జంతువుల గణన, వాటి కదలిక డేటాను ఉపయోగించవచ్చు. అని హైదరాబాద్‌కు చెందిన ఏఐ (AI) సొల్యూషన్స్ కంపెనీ గరుడాలిటిక్స్ సీఈఓ డాక్టర్ వి.ఎస్‌.ఎస్‌. కిరణ్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏఐ-ఆధారిత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌ను రూపొందించిన మూడు స్టార్టప్‌లలో ఇది ఒకటి.

అటవీ ప్రాంతంలో జంతువుల సంఖ్యను అంచనా వేయడం, ఏయే ప్రాంతాల్లో సంచరిస్తున్నాయో ఏఐ టెక్నాలజీతో తెలుసుకోవచ్చు. అటవీ శాఖ ఏప్రిల్‌లో ఈ కసరత్తును ప్రారంభించింది. ఈ డేటా పాయింట్లు వన్యప్రాణుల సంరక్షణలో ఉపయోగపడతాయి. ఫారెస్ట్ AI గ్రాండ్ ఛాలెంజ్ 59 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 12 స్టార్టప్‌లకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌ను రూపొందించడానికి అవకాశం ఇచ్చారు.

సాంకేతికత, వన్యప్రాణుల నిపుణులతో కూడిన జ్యూరీకి మూడు స్టార్టప్‌లు తమ మోడల్‌లను ఇచ్చాయి. తెలంగాణ ఏఐ మిషన్ నేతృత్వంలోని ఈ ఛాలెంజ్‌ కోసం పరిశ్రమ, స్టార్టప్‌లు, ప్రభుత్వం కలిసి రావడం చూసి సంతోషిస్తున్నట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు.

IPL_Entry_Point