Gaddar Passes Away : ఒక శకం ముగిసింది, గద్దర్ మృతిపట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం-telangana folk singer gaddar passed away political leaders condolences ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Folk Singer Gaddar Passed Away Political Leaders Condolences

Gaddar Passes Away : ఒక శకం ముగిసింది, గద్దర్ మృతిపట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

Bandaru Satyaprasad HT Telugu
Aug 06, 2023 06:07 PM IST

Gaddar Passes Away : ప్రజాగాయకుడు గద్దర్ హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

గద్దర్
గద్దర్

Gaddar Passes Away : ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రజాకవి గద్దర్ మరణంపై రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని, ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికిన గద్దర్ మరణం ఊహించలేదన్నారు. గద్దర్ కు తెలుగు జాతి మొత్తం సెల్యూట్ చేస్తోందన్నారు. గద్దర్ లాంటి వ్యక్తుల మాటలు, పాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయని తెలిపారు. గద్దర్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసిందన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రజా గాయకుడు, జన నాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు గద్దర్ మృతి చాలా బాధాకరం అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గద్దర్ మృతి అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటు అన్నారు. గద్దర్ ప్రసంగాలు, పాటలు ప్రజలలో స్ఫూర్తి నింపారని గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గా పేరుపొందిన గుమ్మడి విఠల్ కవిగా, గాయకుడిగా ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని పొందారన్నారు. తన పాటలతో ప్రజల్లో చైతన్యం నింపారని మంత్రి గంగుల గుర్తుచేసుకున్నారు. గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

ప్రజాయుద్ధ నౌక, విప్లవ గాయకుడు గద్దర్ మృతిపట్ల కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన గొంతుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో గద్దర్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

గద్దర్ మృతికి సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం అని చిరంజీవి ట్వీట్ చేశారు. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసిందన్నారు. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిదని తెలిపారు. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు తన ప్రగాడ సంతాపం తెలిపారు.

IPL_Entry_Point