Inter Student Suicides: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్ధుల ఆత్మహత్యలు-students who failed in telangana inter exams committed suicide ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Students Who Failed In Telangana Inter Exams Committed Suicide

Inter Student Suicides: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్ధుల ఆత్మహత్యలు

HT Telugu Desk HT Telugu
May 10, 2023 08:37 AM IST

Inter Student Suicides: తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్దులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పరీక్ష ఫలితాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

పరీక్షల్లో తప్పారని ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యలు
పరీక్షల్లో తప్పారని ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యలు

Inter Student Suicides: తెలంగాణలో మంగళవారం వెల్లడైన ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్ధులు, ఆశించిన స్థాయిలో మార్కులు దక్కని విద్యార్ధులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు వెలువడిన తర్వాత పలు జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన విద్యార్థి (17) హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ విద్యా సంస్థలో ఇంటర్‌ ఫస్టియర్ బైపీసీ చదివాడు. మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు.

జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన విద్యార్థి(16) జగిత్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదివాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.

నారాయణపేట జిల్లా కొత్తకోటకు చెందిన విద్యార్థిని(17)కి ఎంపీసీ మొదటి సంవత్సరంలో 365 మార్కులు వచ్చాయి. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తిరుపతికి చెందిన విద్యార్థి(17) ఈసీఐఎల్‌ రామకృష్ణాపురంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. పటాన్‌చెరులో ఇంటర్‌ఎంపీసీ చదివాడు. ఫెయిల్‌ అవుతాననే భయంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం ఉదయం గుండ్ల పోచంపల్లి- మేడ్చల్‌ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై మృతదేహం లభ్యమైంది. విద్యార్థి పరీక్షల్లో పాసయ్యాడో లేదో తెలియలేదు.

ఖైరతాబాద్‌ తుమ్మలబస్తీకి చెందిన విద్యార్థి(17) ఎస్సార్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ బైపీసీ గ్రూపులో చదివాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు.

గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి(17) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్నాడు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని(17) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ గ్రూపులో చదివింది. పరీక్షా ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో ఇంట్లో ఉరేసుకుంది.

ఇంటర్‌లో ఫెయిలయ్యాననూ మనస్తాపంతో ఓ విద్యార్థిని అదృశ్యం అయింది. బీడీఎల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పటాన్‌చెరు సమీప పాటి గ్రామంలో నివాసం ఉంటున్న భవాని.. ఇంటర్‌ రెండో సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో పాస్‌ కాలేదు. బయటకు వెళ్లి వస్తానంటూ అక్కకు చెప్పి వెళ్లిన ఆ విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు.

సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఠాణా పరిధిలోని వినాయక్‌ నగర్‌కు చెందిన విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అవడంతో ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు.

 

 

IPL_Entry_Point