YS Sharmila: 'ఇక నుంచి నా ఊరు పాలేరు'.. పోటీపై క్లారిటీ ఇచ్చిన షర్మిల-sharmila key statement on contest from paleru constituency ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Sharmila Key Statement On Contest From Paleru Constituency

YS Sharmila: 'ఇక నుంచి నా ఊరు పాలేరు'.. పోటీపై క్లారిటీ ఇచ్చిన షర్మిల

HT Telugu Desk HT Telugu
Jun 19, 2022 01:37 PM IST

పాలేరు నుంచి పోటీ చేస్తారన్న వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. పాలేరులో పోటీ చేయాలనేది అభిమానుల కోరిక కాదని...తన కోరిక కూడా అని స్పష్టం చేశారు.

వైఎస్ షర్మిల(ఫైల్ ఫొటో)
వైఎస్ షర్మిల(ఫైల్ ఫొటో) (twitter)

sharmila contest from paleru: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె... ఈ ప్రకటన చేశారు. వైఎస్సార్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ పార్టీ పతాకం పాలేరు గడ్డ పై ఎగరాలని వ్యాఖ్యానించారు. అత్యధిక మెజారిటీ కోసం అందరూ నాతో కలిసి పనిచేయాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

షర్మిల ఊరు పాలేరు...

'చరిత్ర లో మీరు నేను ఎరగని మెజారిటీ కోసం పని చేద్దాం. ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు. వైఎస్సార్ సైనికులుగా అందరినీ ఒక తాటి మీదకు తేవాలి.ఏ కార్యక్రమం చేపట్టినా పాలేరు పుట్టిన ఇల్లు. పాలేరు నియోజక వర్గం ఒక దిశా - నిర్దేశం అవ్వాలి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు అంతా మీ వైపు చూడాలి. ముందు వరసలో పాలేరు ఉండాలి. పార్టీ అభివృద్ధిలో ఎక్కడ లేనంత ముందు వరసలో ఉండాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి. ప్రజలకు మీరు ఉన్నారన్న భరోసా కల్పించాలి. షర్మిలమ్మ మన నియోజక వర్గం అని చెప్పాలి. మీరు ముందు ఉండాలి ..అందరికీ ఆదర్శం అవ్వాలి' అని అన్నారు.

మంత్రి పువ్వాడపై ఫైర్….

మంత్రి పువ్వాడపై షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. బహిరంగ సభలో మాట్లాడితే సమాధానం చెప్పే దమ్ము లేదన్నారు. కబ్జాలపై సమాధానం చెప్పే సత్తా లేదని విమర్శించారు. ఆయన మెడికల్ కాలేజీ కి దెబ్బ తగులుతుందని.... ప్రభుత్వ మెడికల్ కాలేజీ ను రానివ్వడం లేదని విమర్శించారు. ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులకు ఉచిత సీట్లు ఇస్తామని ఇచ్చావా అని ప్రశ్నించారు. బస్టాండ్ ను చూస్తే నీ పరిపాలన అర్థం అవుతుందని దుయ్యబట్టారు.

'ఆర్టీసీ మంత్రి అయ్యాక...ఖమ్మం కి వచ్చే బస్సులు తగ్గిపోయాయట. ఆర్టీసీ చార్జీలు మాత్రం భారీగా పెరిగి పోయాయి. వైఎస్సార్ బిడ్డకు బయ్యారంలో భాగం ఉందని పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడు. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్పగలను .. వైఎస్సార్ బిడ్డకు ఒక్క పైసా భాగం లేదని. కంత్రి మంత్రి ఆయన బిడ్డల మీద ఒట్టేసి చెప్పగలడా....? ఆడదాన్ని అయి ఉండి మండు టెండలను లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నాను. నేను ప్రజల కోసం కష్టపడుతుంటే.... క్యాట్ వాక్ అని మాట్లాడుతారు. మీకు దమ్ముంటే రెండు రోజులు నాతో పాదయాత్ర చేయండి. వైఎస్సార్ కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తి వైఎస్ఆర్ గురించి మాట్లాడుతున్నాడు. వైఎస్సార్ పేరు ను కాంగ్రెస్ ఎఫ్ ఐఆర్ లో చేర్చినందుకు...పార్టీ కనుమరుగు అయ్యింది. ఈయన పరిస్థితి కూడా అంతే. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తరిమి కొడతాం.ఇలాంటి కంత్రి మంత్రులు ఉన్నంత కాలం తెలంగాణ బాగుపడదు' - వైఎస్ షర్మిల

అయితే  2014లో జరిగిన ఎన్నికల్లోభాగంగా ఖమ్మం జిల్లాలో జగన్ ఆధ్వరంలోని వైసీపీకి ఆదరణ దక్కింది. ఏకంగా 3 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుని సత్తా చాటించింది. ఫలితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం ఎన్నికలపై చూపిందనే చెప్పవచ్చు. అయితే వీటన్నింటిని అంచానే వేసుకున్న తరువాతే వైఎస్ షర్మిల... ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంచుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ అభిమానులు తనకు సహకరిస్తానే భావనతో పాలేరు నుంచి షర్మిల పోటీ చేసేందుకు రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.  ఇక ఇక్కడ్నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు వైఎస్ఆర్ తో మంచి సంబంధాలు ఉండేవి. ఆయన అభిమానులు కూడా తనకు సహకరించే అవకాశంపై కూడా షర్మిల లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

మొత్తంగా చాలా రోజుల నుంచి పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారన్న వార్తలపై తానే ప్రకటన చేయటంతో ఓ క్లారిటీ వచ్చేసింది. ఫలితంగా పాలేరు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

IPL_Entry_Point

టాపిక్