Rythu Bandhu | రైతు బంధు స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Rythu Bandhu.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం అందని రైతులు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు ఈ పథకం పరిధిలోకి రావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రైతు బంధు పథకాన్ని 2018 ఫిబ్రవరి 25న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2018-2019 ఖరీఫ్ సీజన్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రభుత్వం తొలుత ఎకరానికి ఖరీఫ్‌లో రూ. 4 వేలు, రబీలో రూ. 4 వేల చొప్పున ఏటా రూ. 8 వేల ఆర్థిక సాయం అందించింది.
ఇది దేశంలోనే మొట్టమొదటి రైతు పెట్టుబడి సాయం పథకం అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
తరువాత ఈ పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ. 5 వేలకు పెంచింది. అంటే ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీలకు అయ్యే ఖర్చు ఇతర క్షేత్రస్థాయి పెట్టుబడులకు వీటిని ఖర్చు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 58.33 లక్షల మందికి ఈ సాయం అందుతున్నట్టు అంచనా. ఇప్పటివరకు రైతు బంధు అందని రైతులు గానీ, కొత్తగా వ్యవసాయ భూములు కొన్న రైతులు గానీ రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రైతుబంధు దరఖాస్తు విధానం ఇలా..
తమ పాస్ బుక్, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా పాస్ బుక్ తదితర పత్రాలతో సంబంధిత గ్రామ వ్యవసాయ అధికారిని గానీ, మండల రెవెన్యూ అధికారిని గానీ సంప్రదించి దరఖాస్తు సమర్పించవచ్చు.
ఈ పథకం కింద లబ్ధి పొందిన రైతుల్లో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకం ప్రారంభమైన అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఇదే తరహాలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకంలో వ్యవసాయ భూమి ఎంత ఉన్నప్పటికీ గరిష్టంగా రూ. 6 వేలు మాత్రమే లభిస్తాయి.
సంబంధిత కథనం