Rythu Bandhu : ఈ నెల 28 నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు
త్వరలో అన్నదాతల ఖాతాల్లోకి రైతు బంధు నగదు పడనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.
వర్షకాలం పంట పెట్టుబడి సాయం గురించి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. త్వరలోనే రైతుబంధు నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారన్నారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయశాఖ కాల్ సెంటర్‌ను మంత్రి నిరంజన్ ప్రారంభించారు. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే.. కార్యక్రమాలు రైతులకు తెలిపేందుకు, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసం ఈ కాల్ సెంటర్ ఉపయోగపడనున్నట్టు తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాలకు సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చన్నారు.
ఇప్పటికే కేసీఆర్.. ఆర్థిక, వ్యవసాయశాఖలకు ఆదేశాలు జారీ చేశారని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ వానాకాలం సైతం సకాలంలో సొమ్ము జమ చేస్తామన్నారు. రైతు బంధు రాదనే ప్రచారాలను నమ్మెుద్దన్నారు. ఎకరా నుంచి 2, 3,4, 5 ఎకరాల చొప్పున రైతు బంధు డబ్బులు జమ చేయనున్నట్టుగా పేర్కొన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కొంత ఆలస్యం జరగిందని నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రం సహకరించకపోయినా రైతుబంధును గతంలో లాగే ఇస్తామని చెప్పారు. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాల వల్ల ఆలస్యమైందని తెలిపారు.
ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నదాతలకు ఏటా రెండు సీజన్లకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తోంది. ఈసారి ఈ పథకం కింద అర్హులైన మరింత మంది రైతులు కొత్తగా చేరారు. రైతుబంధు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు విడుదల చేసింది.
టాపిక్