Priyanka Meeting: హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ..సరూర్‌నగర్‌లో యువసంఘర్షణ సభ
Priyanka Meeting: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ నేడు హైదరాబాద్ రానున్నారు. సరూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న నిరుద్యోగ యువసంఘర్షణ సభలో ప్రియాంక పాల్గొంటారు.
Priyanka Meeting: తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ యువ సంఘర్షణ సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్ రానున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటుండటంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో తొలిసారి ప్రియాంక గాంధీ బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నిరుద్యోగులు, విద్యార్దులు, యువతకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడంతో పాటు ఈ ఏడాది జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూరేలా ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులను పెద్ద ఎత్తున సరూర్ నగర్ తరలించడానికి ఏర్పాట్లు చేశారు.
వివిధ జిల్లాల నుంచి యువతను సభా స్థలికి తరలించే బాధ్యతలను జిల్లా నాయకులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా నుంచి 20వేల మందిని, మేడ్చల్ జిల్లా నుంచి 10వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సమావేశం జరుగునున్న సరూర్ నగర్ స్టేడియం పరిసరాలతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎల్బీనగర్ వరకు దారి పొడవున కటౌట్లు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ప్రియాంక పాదయాత్ర రద్దు…
ప్రియాంక గాంధీ పర్యటనలో భాగంగా ఎల్బీనగర్ కూడలిలో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం నుంచి స్టేడియం వరకు పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నేతలు భావించారు. గాంధీ భవన్ నుంచి పాదయాత్ర నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. భద్రతా కారణాలతో ప్రియాంక పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా స్టేడియంకు ప్రియాంక వెళ్లనున్నారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారు.
సరూర్‌నగర్ సమావేశంలో నిరుద్యోగులు, యువతకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కలిగించేలా యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని కాంగ్రస్ నేతలు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విద్యార్ధులు, నిరుద్యోగులు కోసం చేసిన కృషి, ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రియాంక వివరించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందనే భరోసాను కూడా వేదికపై ప్రకటించనున్నారు.
తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఫీజు రియింబర్స్‌మెంట్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తదితర హామీలను నిరుద్యోగ యువ సంఘర్షణ సభలో ప్రియాంక వెల్లడించనున్నారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు గుర్తింపు కార్డులు, నెలకు రూ.25వేల పింఛను, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత వంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది.