PM Tour: రేపు భాగ్యనగరానికి ప్రధాని మోదీ.. నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు-prime minister modi will visit hyderabad tomorrow heavy traffic restrictions in the city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm Tour: రేపు భాగ్యనగరానికి ప్రధాని మోదీ.. నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

PM Tour: రేపు భాగ్యనగరానికి ప్రధాని మోదీ.. నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu
Apr 07, 2023 07:17 AM IST

PM Tour: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. 8వ తేదీన ప్రధాని మోదీ వస్తుండటంతో సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీఆనంద్ ప్రకటించారు. వందేభారత్ ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్స్‌ సభలో ప్రధాని పాల్గొంటారు.

రేపు హదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ
రేపు హదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ (ANI)

PM Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన కోసం శనివారం సికింద్రాబాద్‌ రానుండటంతో సికింద్రాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవం, ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌లో పబ్లిక్‌ మీటింగ్‌లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2:30 వరకు సికింద్రాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు.

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే…

టివోలి ఎక్స్‌ రోడ్స్‌ నుంచి ఫ్లాజా ఎక్స్‌ రోడ్డు వరకు ఉన్న మార్గాన్ని రెండు వైపుల మూసేస్తారు.

ఎస్‌బీహెచ్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి స్వీకార్‌.. ఉపకార్‌ జంక్షన్‌ వరకు ఇరువైపుల రోడ్డును మూసేస్తారు.

చిలకల గూడ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ జంక్షన్‌, రేతిఫైల్‌ టీ జంక్షన్ల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలను అనుమతించరు. ప్రయాణికులు క్లాక్‌ టవర్‌ పాస్‌పోర్టు ఆఫీస్‌, రెజిమెంటల్‌ బజార్‌ రూట్‌ను ఉపయోగించుకొని సికింద్రాబాద్‌ స్టేషన్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.

కరీంనగర్‌ వైపు నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా సికింద్రాబాద్‌ నగరంలోకి వచ్చే వారు ఓఆర్‌ఆర్‌ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, మూసాపేట్‌, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

కీసర ఓఆర్‌ఆర్‌ గేట్‌ నుంచి ఈసీఐఎల్‌, మౌలాలీ, నాచారం, ఉప్పల్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.

తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి ఎడమవైపు తీసుకొని ఏఎస్‌రావునగర్‌, ఈసీఐఎల్‌, మౌలాలీ, తార్నాక నుంచి సిటీలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి.

కరీంనగర్‌ వైపు రాకపోకలు సాగించే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌, జేబీఎస్‌ రూట్లలో వెళ్లకుండా ఓఆర్‌ఆర్‌పై నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.

ప్రధాని సభకు కేటాయించిన పార్కింగ్‌ స్థలాలు

ఆర్టీసీ బస్సుల కోసం కరీంనగర్‌ మార్గంలో వచ్చే దోబీఘాట్‌ వద్ద నిలపాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మెదక్‌, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు బైసన్‌ పోలో గ్రౌండ్స్, రంగారెడ్డి, కర్నూల్‌, అచ్చంపేట్‌, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట్‌, వరంగల్‌, యాదాద్రి రూట్‌లో వచ్చే వారు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో పార్కు చేయాలి.

రాజీవ్‌ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్‌ పార్కు గ్రౌండ్‌, పికెట్‌ డిపో ప్రాంగణంలో, అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డులో పార్కు చేయాలని సూచించారు.

రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు..

రాజీవ్‌ గాంధీ విగ్రహం జంక్షన్‌, గ్రీన్‌ లాండ్స్‌, ప్రకాశ్‌నగర్‌, రసూల్‌పురా సీటీఓ, ఫ్లాజా, ఎస్‌బీహెచ్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్డు, ఆలుగడ్డబావి, చిలకలగూడ జంక్షన్‌, ఎంజే రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్పీ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీసులు సూచించారు. ప్రయాణికులు ఆ మార్గాల్లో జంక్షన్ల వైపు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. ఉప్పల్‌ – సికింద్రాబాద్‌ రూట్‌లో సైతం ట్రాఫిక్‌ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రధాని పర్యటన సమయంలో అత్యవసరం అయితే తప్ప పనులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

 

Whats_app_banner