Niranjan Reddy on Ground Nut Farming : యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశనగ-minister niranjan reddy asks officials to increase ground nut farming in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Niranjan Reddy Asks Officials To Increase Ground Nut Farming In Telangana

Niranjan Reddy on Ground Nut Farming : యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశనగ

HT Telugu Desk HT Telugu
Jan 09, 2023 10:47 PM IST

Niranjan Reddy on Ground Nut Farming : నూనెగింజల పంటల్లో ఒకటైన వేరుశనగ సాగుని రాష్ట్రంలో విస్తరించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశనగ సాగు చేపట్టాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి... వనపర్తి జిల్లా వీరాయపల్లిలో వేరుశెనగ పరిశోధనా కేంద్రానికి 40 ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు.

నిరంజన్ రెడ్డి సమీక్ష
నిరంజన్ రెడ్డి సమీక్ష

Niranjan Reddy on Ground Nut Farming : రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోన్న ప్రభుత్వం.. నూనె గింజల సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. పామాయిల్, పల్లీ, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి పంటల సాగు కోసం సర్కార్ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటితో పాటు నువ్వులు, ఆవాలు, కుసుమలు పండించడానికి అత్యంత అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పటికే.. పామాయిల్ సాగుని విస్తరించేందుకు అనేక విధాలుగా కృషి చేస్తోన్న ప్రభుత్వం.... ఇప్పుడు వేరుశనగ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో... హైదరాబాద్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.... యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశెనగ సాగు విస్తరించాలని అధికారులకి సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

"దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో వేరుశనగ సాగు విస్తరించాలి. ఆ దిశగా పాలెం, జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో తరచుగా రైతు అవగాహన సమావేశాలు నిర్వహించాలి. పంట క్యాలెండర్ తయారుచేసి దానికి అనుగుణంగా రైతువేదికలలో శిక్షణలు ఇవ్వాలి. ఆయిల్ పామ్ తో పాటు వేరుశెనగ మరియు ఇతర నూనెగింజల పంటల అభివృద్ధికి ఆయిల్ ఫెడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నిధులు ఇచ్చి ప్రోత్సహించాలి. అధిక దిగుబడులిచ్చి, చీడపీడలను తట్టుకునే నూతన వంగడాలను మూడు, నాలుగేళ్లలో అందించేందుకు శాస్త్రవేత్తలు కృషిచేయాలి" అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

వేరుశెనగ పంటకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆయిల్ ఫెడ్ ద్వారా ఆయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తామని...వనపర్తి జిల్లా వీరాయపల్లిలో వేరుశెనగ పరిశోధనా కేంద్రానికి 40 ఎకరాలు కేటాయిస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండే వేరుశెనగకు అంతర్జాతీయ డిమాండు ఉందన్న ఆయన... ఆఫ్లాటాక్సిన్ లేని నాణ్యమైన వేరుశెనగ ఈ ప్రాంత ప్రత్యేకత అని చెప్పారు. రాబోయేకాలంలో వేరుశెనగ పంట విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని... దానికి అనుగుణంగా పెద్దమందడి మండలం వీరాయపల్లిలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ సహకారం, సమన్వయంతో వేరుశెనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీరాయపల్లి వేరుశెనగ పరిశోధనా కేంద్రంలో మౌళిక వసతుల కల్పనకు త్వరలో రూ.2 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.

సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ సుధీర్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, ఇక్రిషాట్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జనీలా, ఇతర శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

IPL_Entry_Point