Minister Jupally Krishna Rao : మరోసారి మంత్రిగా జూపల్లి కృష్ణారావు - రాజకీయ ప్రస్థానం ఇదే-minister jupally krishna rao political journey ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Jupally Krishna Rao Political Journey

Minister Jupally Krishna Rao : మరోసారి మంత్రిగా జూపల్లి కృష్ణారావు - రాజకీయ ప్రస్థానం ఇదే

HT Telugu Desk HT Telugu
Dec 07, 2023 03:06 PM IST

Minister Jupally Krishna Rao News: కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జూపల్లికి మంత్రి పదవి దక్కింది. గురువారం మినిస్టర్ గా ప్రమాణం చేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడ చదవండి….

మంత్రి జూపల్లి
మంత్రి జూపల్లి

Minister Jupally Krishna Rao Political Journey : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు అయిదేళ్ల విరామం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు.సుధీర్ఘ రాజకీయ అనుభవం,రాజకీయ చితురుడు అయిన జూపల్లి కృష్ణారావు ప్రస్తుత వనపర్తి జిల్లా చిన్నంభవి మండలం పెద్ద దగడ గ్రామంలో ఆగస్ట్ 10,1955 లో శేషగిరిరావు,రత్నమ్మ దంపతులకు జన్మించారు.ఈ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం ఉండగా కృష్ణారావు ఆరో సంతానం.

2004 లో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు...

1999 లో కాంగ్రెస్ పార్టీ తరఫున జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజీకవర్గాం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.2004 లో పొత్తులో భాగంగా కొల్లాపూర్ స్థానం అప్పటి తెరాస పార్టీకి కేటాయించడంతో జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఘన విజయం సాధించారు. 2009,2012 లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జూపల్లి విజయం సాధించారు.

ముగ్గురు సీఎంల క్యాబినెట్ లో మంత్రిగా జూపల్లి....

మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మరియు రోశయ్య క్యాబినెట్ లలో జూపల్లి మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీకి,మంత్రి పదవికి జూపల్లి రాజీనామా చేసి తెరాస పార్టీలో చేరారు.2014 లో తెరాస అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.కేసిఆర్ క్యాబినెట్ లో భారీ పరిశ్రమలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు.

2018 లో ఓటమి....

2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎవ్వరూ ఊహించని విధంగా జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు.తనపై గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని బిఆర్ఎస్ లోకి చేర్చుకోవడం తో జూపల్లి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.అదే పార్టీలో కొనసాగుతూ

క్యాడర్ దెబ్బ తినకుండా తానే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులను గెలిపించుకున్నాడు.టికెట్ తనకే వస్తుందని జూపల్లి ఆశతో ఉన్న సమయంలో సిట్టింగ్ లకే టిక్కెట్లు అంటూ కేసిఆర్ ప్రకటించడంతో జూపల్లి అసంతృప్తి తో ఉండిపోయారు.

2023 లో ఘన విజయం....

ఈ సమయంలోనే ఖమ్మం జిల్లాలోని కీలక నేతలు పొంగులేటి,తుమ్ముల తో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి మారేందుకు సన్నద్ధం అయ్యాడు జూపల్లి.ఈ క్రమంలోనే బి ఆర్ ఎస్ అధినేత మాజీ సీఎం కేసిఆర్ జూపల్లి కృష్ణారావు ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లి కి కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ కేటాయించింది.ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా,మంత్రిగా పని చేసిన జూపల్లి కి 2018 లో ఆరో సరి ఘోర పరాజయం తరువాత తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఘన విజయం సాధించారు.

రాష్ట్రంలో 64 సీట్లను దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జూపల్లి కి మంత్రిగా బాధ్యతలు అప్పగించింది.గురువారం ఎల్ బి స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం లో జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు.ఈ సందర్బంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు,జూపల్లి అనుచరులు ఘనంగా సంబరులు చేసుకుంటున్నారు.

రిపోర్టింగ్": కేతిరెడ్డి తరుణ్

IPL_Entry_Point