Komatireddy : క్షమాపణలు చెప్పాల్సిందే, కాంగ్రెస్‌ను వీడేది లేదన్న కోమటిరెడ్డి…-komatireddy venkatareddy says that he will continue in congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Komatireddy Venkatareddy Says That He Will Continue In Congress Party

Komatireddy : క్షమాపణలు చెప్పాల్సిందే, కాంగ్రెస్‌ను వీడేది లేదన్న కోమటిరెడ్డి…

B.S.Chandra HT Telugu
Aug 12, 2022 02:56 PM IST

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్‌ను వీడి ఎక్కడికి వెళ్లనని ఎవరు పార్టీ వీడిపోతారో కాలమే తేలుస్తుందంటున్నారు.

కాంగ్రెస్‌ను వీడనంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాంగ్రెస్‌ను వీడనంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను బయటకు పంపేందుకు కొంతమంది నాయకులు కుట్ర చేస్తున్నారని నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మునుగోడు సభలో తనను అసభ‌్యంగా తిట్టించారని, వేదికపై ఉన్న నాయకులు ఎవరు తనను తిడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేయకుండా నవ్వుకుంటూ కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు సభకు తనకు ఆహ్వానం లేకపోవడం వల్లే వెళ్లలేదని ఇతర నాయకులు ఇళ్లకు వెళ్లి పిలిచేందుకు తీరిక ఉన్న పిసిసి అధ్యక్షుడికి తనను కలవడానికి మాత్రం తీరిక లేకపోయిందని విమర్శించారు.

మునుగోడు సభలో దగ్గరుండి తనను తిట్టించారని, తన స్థానంలో ఎవరున్నా బాధ పడతారని వెంకటరెడ్డి చెప్పారు. 30ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పదవుల్ని త్యాగం చేస్తే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు తమను అవమానిస్తున్నారని ఆరోపించారు. తనను తిట్టిన తర్వాత క్షమాపణలు, షోకాజ్‌ నోటీసులంటూ నాటకాలు ఆడారాని ఆరోపించారు. పిసిసి అధ్యక్షుడి అధ్యక్షతన జరిగిన సభలో తనను తిట్టించినందుకు కనీసం విచారం వ్యక్తం చేయకుండా నవ్వుకుంటూ ఉండిపోయారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.

నాలుగు ఉపఎన్నికల్లో రెండు టిఆర్ఎస్‌, రెండు బీజేపీలు గెలిచాయని ముందే పిసిసి అధ్యక్షుడు చేతులెత్తేశారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేయకుండా ముందే చేతులెత్తేశారని ఆరోపించారు. మునుగోడులో ఓడిపోతే కాంగ్రెస్‌ పార్టీకి వెంట్రుకతో సమానమని అనడాన్ని వెంకటరెడ్డి తప్పు పట్టారు. తన రక్తంలో కాంగ్రెస్‌ రక్తం ఉందని, నాలుగు పార్టీలు మారి వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ మీద ప్రేమ ఎందుకు ఉంటుందన్నారు. పిసిసి అధ్యక్షుడి వ్యవహారాన్ని రాహుల్ గాంధీ దగ్గరే తేల్చుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో ఎస్టీలకు కూడా దళిత బంధు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ పరిశీలకుడు మాణిక్ ఠాగూర్ వచ్చినా తనకు ఆహ్వానం లేదని, కాంగ్రెస్‌ పెద్దల సమక్షంలోనే హోమ్‌గార్డు, బ్రాందీ షాపులని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమ్‌గార్డులాంటి తమను ఐపిఎస్‌ అధికారులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు.తమ్ముడు ఓవైపు, పార్టీ మరో వైపు ఉండి, క్లిష్ట పరిస్థితిలో తాను ఉన్నపుడు తనను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మునుగోడు ప్రచారానికి తనను ఎవరు ఆహ్వానించలేదని, ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లే ప్రసక్తి లేదన్నారు. తనను అవమానించినందుకు క్షమాపణలు చెప్పి, ఆహ్వానిస్తే మాత్రమే వెళ్తానన్నారు. 30ఏళ్లుగా పార్టీలో ఉన్న తాను హోమ్‌ గార్డు అయితే, పార్టీకి నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్‌ అధికారి ఒంటి చేత్తో ఎన్నికల్ని గెలిపిస్తారన్నారు.

ఠాకూర్‌ స్థానికంగా పర్యటనకు వచ్చి కూడా తనకు సమాచారం ఇవ్వలేదని, సోనియా, రాహుల్‌ గాంధీల వద్ద తనకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని తాను వీడే ప్రసక్తి లేదన్నారు. అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేంటని, రాజగోపాల్‌ రెడ్డి ఏ పార్టీలో ఉన్న తనకు ఇబ్బంది లేదన్నారు.పిసిసి అధ్యక్షుడికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు తెలియవని ఎవరు పార్టీని విడిచి పారిపోతారో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.

IPL_Entry_Point