Ts Formation: నెత్తుటి చుక్క చిందకుండా.. రాష్ట్రాన్ని సాధించారు-kcr who succeeded in winning the state without shedding blood ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Who Succeeded In Winning The State Without Shedding Blood

Ts Formation: నెత్తుటి చుక్క చిందకుండా.. రాష్ట్రాన్ని సాధించారు

HT Telugu Desk HT Telugu
May 30, 2023 11:44 AM IST

Ts Formation: ఉద్యమ దశ నుంచి తెలంగాణ అకాంక్ష ఆచరణ రూపు దాల్చి పదో ఏట అడుగిడుతోంది. పదేళ్ల క్రితం పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. సుదీర్ఘ కాలం పాటు సాగిన తెలంగాణ పోరాటాలు ఫలించి 2014 జూన్‌2న కొత్త రాష్ట్రం ఆవిర్భవించింది. పోరాటం హింసా మార్గం పట్టకపోవడంతోనే లక్ష్యం నెరవేరింది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

Ts Formation: మలి దశ ప్రత్యేక తెలంగాణ పోరాటానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలు ఎన్ని జరిగినా అవన్నీ ప్రజాస్వామ్యబద్దంగా, అహింసాయుతంగానే సాగాయి. రాజకీయ ఒత్తిళ్లు, వ్యూహాలు ఫలించి ప్రత్యేక రాష్ట్రం నెరవేరింది. ఈ క్రమంలో 2009-14 మధ్య జరిగిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయి.

తెలంగాణ పోరాటంలో చివరి నాలుగేళ్లు అత్యంత కీలకం. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో సారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఎనిమిదేళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ టిఆర్‌ఎస్‌ కూడా 2009 నాటికి కొత్త రాజకీయ వ్యూహాలను వెదుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఆ పార్టీలో అంతకు ముందు ఉన్న ఉత్సాహం తగ్గిపోయింది.

2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన కొద్ది రోజులకు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలు చేపట్టారు. అలాంటి సమయంలో కేసీఆర్‌ కొత్త అస్త్రాలను ఎక్కుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటానికి అదే సరైన సమయమని భావించారు.

2009లో రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో అధికారాన్ని దక్కించుకోడానికి వేర్వేరు వ్యక్తుల మధ్య పోరాటాలు జరుగుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఎత్తుకోవడం కేసీఆర్‌కు లాభించింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నాయకత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్‌ నినాదానికి మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అధికార పీఠాన్ని దక్కించుకోడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న సమయంలో కేసీఆర్‌ దూకుడు పెంచారు.

కేవలం రెండున్నర మూడు నెలల వ్యవధిలోనే అగ్గిరాజేశారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కేసీఆర్‌ డిమాండ్‌కు మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు కేసీఆర్ ఆమరణ దీక్షకు పిలుపునివ్వడంతో తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందాయి.

మలిదశ పోరాటంలో భాగంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు ఢిల్లీ వరకు పాకాయి. న్యాయవాదులు, విద్యార్ధులు ఢిల్లీలో ఏకంగా పార్లమెంటును ముట్టడించే ప్రయత్నం చేశారు. 2009డిసెంబర్‌లో న్యాయవాదుల జేఏసీ చేపట్టిన ఆందోళన పార్లమెంటును తాకడంతో కేంద్రం అప్రమత్తమైంది. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు అదుపు తప్పుతాయనే ఆందోళనతో 2009 డిసెంబర్ 9న కేంద్ర హోమంత్రి చిదంబరం కేంద్రం తరపున ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

2009 డిసెంబర్ 9 ప్రకటనతో అటు ఆంధ్రాలో పరిస్థితులు ఆందోళన ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల్ని చక్కబెట్టడానికి కేంద్రం చేసిన ప్రకటనతో ఆందోళనలు తగ్గుముఖం పడతాయని కేంద్రం భావిస్తే దానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. రెండు వారాల తర్జన భర్జన తర్వాత డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసింది. సంప్రదింపుల ద్వారా పరిష్కార మార్గాన్ని కనుగొంటామని ప్రకటించింది.

ఆ తర్వాత నాలుగేళ్ల పాటు రెండు ప్రాంతాల్లో ఉధృతంగా ఉద్యమాలు నడిచాయి. చివరకు 2013 ఆగష్టులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించడంతో మలిదశ తెలంగాణ పోరు ఓ దారికి వచ్చింది. చివరకు 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు సాక్షిగా కొత్త రాష్ట్ర ఏర్పాటు సాకారమైంది. ఈ క్రమంలో రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు అడుగడుగున అనేక అవాంతరాలు ఎదురైనా చివరకు తెలంగాణ ప్రజల స్వప్నం నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం ఏ మాత్రం హింసాత్మకం కాకుండా, ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచి వేసే అవకాశాన్ని పాలకులకు ఇవ్వకుండా జాగ్రత్తగా నడిపించడంతోనే లక్ష్యాన్ని చేరుకోగలిగింది.

IPL_Entry_Point