BRS Kisan Cell : బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గుర్నాంసింగ్-kcr appoints gurnamsingh as brs kisan cell president ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Appoints Gurnamsingh As Brs Kisan Cell President

BRS Kisan Cell : బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గుర్నాంసింగ్

HT Telugu Desk HT Telugu
Dec 14, 2022 08:40 PM IST

BRS Kisan Cell : ఢిల్లీలో జాతీయ కార్యాలయం ప్రారంభంతో దేశ రాజకీయాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టిన బీఆర్ఎస్ .. పార్టీకి జాతీయ స్థాయి నియామకాలకూ శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ ని నియమించిన కేసీఆర్.. నియామకపత్రాన్ని స్వయంగా అందించారు.

గుర్నాంసింగ్ కి నియామక పత్రం అందిస్తున్న కేసీఆర్
గుర్నాంసింగ్ కి నియామక పత్రం అందిస్తున్న కేసీఆర్

BRS Kisan Cell : అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది. పార్టీ ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగానే జాతీయ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తొలి నియామకం చేపట్టారు. బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ చడూనిని నియమించారు. ఈ మేరకు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్ష హోదాలో నియామక పత్రంపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. గుర్నాసింగ్ కు స్వయంగా నియామకపత్రాన్ని అందించారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్ ను నియమించారు. త్వరలోనే ఏపీ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల బాధ్యులను ప్రకటించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల నుంచి పలువురు నేతలతో కేసీఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు.

అంతకముందు.. దేశ రాజధాని ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్ నంబర్ 5లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:39 నిమిషాలకు బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం మొదటి అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్లో జాతీయ అధ్యక్షుడి హోదాలో కుర్చీలో ఆసీనులయ్యారు. కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు పలువురు రైతు సంఘం నేతలు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయ‌కులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా సర్దార్ పటేల్ రోడ్డు జై భారత్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది.

కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. బీఆర్ఎస్ జాతీయ విధానానికి సంబంధించి పలువురితో మంతనాలు, సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కలిసి వచ్చే వారందరితో చర్చించిన తర్వాత.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే జాతీయ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు, జాతీయ కార్యదర్శుల నియామకంపై ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి.

IPL_Entry_Point

టాపిక్