BJP On Munugode : మునుగోడుతో బీజేపీ టార్గెట్ ను కొట్టేసిందా?-is bjp successfully complete their target with munugode by election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Is Bjp Successfully Complete Their Target With Munugode By Election

BJP On Munugode : మునుగోడుతో బీజేపీ టార్గెట్ ను కొట్టేసిందా?

Anand Sai HT Telugu
Nov 06, 2022 03:26 PM IST

BJP In Munugode : మునుగోడును బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని అనుకుంది. అయితే గెలుపు? ఓటమి? అనే విషయాన్ని పక్కనపెడితే.. బీజేపీ అనుకున్న టార్గెట్ ఇక్కడ దొరికినట్టేనా? టీఆర్ఎస్ పార్టీకి.. బలమైన ప్రత్యర్థి అని నిరూపించుకున్నట్టేనా?

బీజేపీ
బీజేపీ

బీజేపీ ప్లాన్స్ అంత ఈజీగా అర్థం కావు.. ఎలాగైనా తెలంగాణ(Telangana)లో పాగా వేయాలి. అందుకోసం రంగం సిద్ధం చేయాలి. సో.. కలిసి వచ్చింది మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll) . గెలవాలని ప్లాన్ 'ఏ' వేసుకుంది. ఒకవేళ కుదరకుంటే ప్లాన్ 'బీ'లో ఉంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఎంతోకొంత బలమైన నేతలు ఉన్నారు. దక్షిణ తెలంగాణపైనా ఫోకస్ చేసి.. పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా జోష్ తేవాలని ప్రణాళికలు వేసింది. ఇదే సమయంలో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. ఓటమి, గెలుపుతో సంబంధం లేకుండా తాము అనుకున్న పని జరిగినట్టుగా బీజేపీ అనుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

రాబోయేది ఎన్నికల కాలం.. దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. సరైన అవకాశం కోసం చూస్తున్న సమయంలోనే రాజగోపాల్ రెడ్డి చేరికతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్(TRS)కు ప్రత్యామ్నాయం అని చూపించుకునేందుకు ఈ వేదిక బీజేపీకి సరిగా ఉపయోగపడింది. రాజగోపాల్ రెడ్డి బలమైన నేత కావడంతో బీజేపీ అనుకున్నట్టుగానే గతంలో కంటే.. ఎక్కువ ఓట్లు ఇక్కడ వచ్చాయి. ఇది రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) చరిష్మాతోపాటుగా బీజేపీకి కలిపి వచ్చిన ఓట్లు. గతంలో 12 వేల ఓట్లు వచ్చిన బీజేపీకి.. ఈసారి అధికార పార్టీకి భయం పుట్టించేలా ఓట్లు వచ్చాయి.

అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి సొంత బలంతో ఎక్కువ ఓట్లు వచ్చినా.. బీజేపీ కలిసే వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ(TRS)తో హోరాహోరిగా పోరాడే సత్తా ఉంది మాకేనని బీజేపీ వచ్చే ఎన్నికల్లో బలంగా ప్రచారం చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఓన్లీ కమలం పార్టీనే అని చెప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ(Congress party) మా తర్వాతేనని ప్రచారం చేసుకుంటుంది. మునుగోడు ఉపఎన్నికతో ఇది నిరూపితమైందని చెప్పుకొనేందు ఆస్కారం ఉంది.

రాబోయే ఎన్నికల్లో ఇదే విషయంతో బీజేపీ(BJP).. జనాల్లోకి వెళ్లనుంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం.. ఇక బీజేపీనే అని బలంగా జనాల్లోకి తీసుకెళ్లనుంది. అయితే ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు నష్టం చేసే అవకాశం ఉంది. మునుగోడు స్థానం కాంగ్రెస్ పార్టీది. కానీ ఉపఎన్నికలో మూడో స్థానానికి కాంగ్రెస్ పార్టీ పడిపోవడంతో బీజేపీకి చాలా ప్లస్ అయింది. మునుగోడులో వచ్చిన ఓట్లతో బీజేపీ కాస్త బలం పెరిగినట్టైంది.

గతంలో మునుగోడు(Munugode) గడ్డపై ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గంగిడి మనోహర్ రెడ్డి పోటీ చేయగా 27 వేలకుపైగా ఓట్లు సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 12 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి మాత్రం అధికార పార్టీ అభ్యర్థికి ధీటుగా ఓట్లు వచ్చాయి. రాజగోపాల్ రెడ్డి చరిష్మాతో వచ్చినా.. ఈ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకుని ఇంక ముందుకు దూసుకుపోనుంది.

టీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలంటే.. ఉత్తర తెలంగాణ(Telangana) మాత్రమే సరిపోదు. అందుకే దక్షిణ తెలంగాణపైనా.. బీజేపీ ఫోకస్(BJP Focus) పెట్టింది. ఇతర పార్టీల నుంచి జంపయ్యే.. బలమైన నేతలకు బీజేపీ గాలం వేసే అవకాసం ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అసమ్మతి నేతలపై గురి పెడుతుంది. దక్షిణ తెలంగాణలోని ఆ అసమ్మతి నేతలకు కాషాయం కండువా కప్పి.. ఎలాగైనా బలపడాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల ఆశచూపి.. బీజేపీలో చేరికలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

IPL_Entry_Point