High Court Murder : రూ.10 వేల కోసం గొడవ, కోపంతో హైకోర్టు ముందే దారుణ హత్య!-hyderabad man murdered in broad daylight in telangana high court quarrel for rs 10k ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  High Court Murder : రూ.10 వేల కోసం గొడవ, కోపంతో హైకోర్టు ముందే దారుణ హత్య!

High Court Murder : రూ.10 వేల కోసం గొడవ, కోపంతో హైకోర్టు ముందే దారుణ హత్య!

Bandaru Satyaprasad HT Telugu
May 04, 2023 01:18 PM IST

High Court Murder : హైదరాబాద్‌లో గురువారం దారుణ ఘటన జరిగింది. తెలంగాణ హైకోర్టు ముందు నడి రోడ్డుపై ఓ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య రూ.10 వేల కోసం జరిగిన గొడవ ఈ దారుణానికి దారితీసింది.

హైకోర్టు ముందు దారుణ హత్య
హైకోర్టు ముందు దారుణ హత్య (HT_PRINT)

High Court Murder : హైదరాబాద్ లో పది వేల రూపాయల కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. హైకోర్టు ముందే ఈ దారుణం జరిగింది. తెలంగాణ హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే దుండగుడు కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే వ్యక్తిని కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు అంటున్నారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అప్పటికే బాధితుడు మృతిచెందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి స్థానికంగా సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న మిథున్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కోపం పట్టలేక కత్తితో పొడిచానని నిందితుడు పోలీసులకు చెబుతున్నాడు.

విజయవాడలో రూ.100 కోసం దాడి

బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గంజాయి, మద్యం మత్తులో నిత్యం ప్రజలపై దాడులకు దిగుతున్నారు. డబ్బులు కోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడంలేదు. విజయవాడ ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరగడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అయినా బ్లేడ్ బ్యాచ్ లు మాత్రం రెచ్చిపోతున్నాయి. తాజాగా బెజవాడలో మరోసారి బ్లేడ్ బ్యాచ్ కలకలం సృష్టించింది. హరిప్రసాద్ అనే యువకుడు మాచవరంలోని ఓ సెలూన్ షాప్ లో పని చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్ నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి సెలూన్ షాపు నుంచి తిరిగి హాస్టల్ కు వెళ్తుండగా... మార్గమధ్యలో మాస్కులు వేసుకున్న ఇద్దరు యువకులు హరి ప్రసాద్ ను అడ్డుకున్నారు. వెంటనే రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద రూ.100 లేవని హరిప్రసాద్ చెప్పడంతో.. కనీసం రూ.50 అయినా ఇవ్వాల్సిందేనని వేధించారు. తనవద్ద డబ్బులు లేవని ఎంత చెప్పిన వినిపించుకోకుండా బ్లేడ్ లతో హరిప్రసాద్ ముఖంపై విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.

25 మంది నగర బహిష్కరణ

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన హరిప్రసాద్ ను కొందరు వాహనదారులు గమనించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని హరి ప్రసాద్ ను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరిప్రసాద్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బ్లేడ్ బ్యాచ్ దాడి విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకట్టవేసేందుకు గతంలో 25 మందిని పోలీసులు నగర బహిష్కరణ చేశారు. అయినా బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోవడంతో స్థానికులు భయదోళలనకు గురవుతున్నారు. రాత్రుళ్లు బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని అంటున్నారు. పోలీసులు రాత్రుళ్లు గస్తీ నిర్వహించి బ్లేడ్ బ్యాచ్ ఆట కట్టించాలని కోరుతున్నారు.

IPL_Entry_Point