Etela Rajender : ఈటల రాజేందర్ కు కీలక పదవి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు!-hyderabad bjp mla etela rajender appointed bjp election management committee chairman ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Bjp Mla Etela Rajender Appointed Bjp Election Management Committee Chairman

Etela Rajender : ఈటల రాజేందర్ కు కీలక పదవి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు!

Bandaru Satyaprasad HT Telugu
Jul 04, 2023 05:08 PM IST

Etela Rajender : ఈటల రాజేందర్ కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యత అప్పగించింది. ఆయనను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమించింది.

ఈటల రాజేందర్
ఈటల రాజేందర్

Etela Rajender : బీజేపీ అధిష్ఠానం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ బీజేపీ నాయకత్వం మార్పులు చేసిన అధిష్ఠానం... కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో ఈటల రాజేందర్ ను బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. రాష్ట్ర నాయకత్వంలో అసంతృప్తి వ్యక్తం చేసి ఈటల రాజేందర్... ఇటీవల దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులతో పాటు పార్టీలో పరిణామాలు వివరించారు. దీంతో బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఇకపై ఈటల తెలంగాణలో చక్రం తిప్పుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఎన్నికల ఏడాది కీలక నిర్ణయాలు

ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్ఠానం పార్టీలో సంస్థాగత మార్పులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను మార్చింది. దీంతో రాష్ట్ర శాఖ కార్యవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయబోతుందని సమాచారం. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను కూడా మారుస్తుందని తెలుస్తోంది.

ఈటల స్పందన

ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. తన మీద విశ్వాసం ఉంచి బాధ్యతులు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, సంతోష్, తరుణ్ ఛుగ్ , సునీల్ బన్సల్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వాడిని, కేసీఆర్ బలం బలహీనతలు తెలిసిన వాడిని, నేను ఒక కార్యకర్తగా నా బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తానని ఈటల అన్నారు. కిషన్ రెడ్డి సీనియర్ నాయకులు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆయనతో కలిసి పనిచేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.

ఏపీ బీజేపీలో మార్పులు

ఏపీ బీజేపీలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తగిన ప్రాధాన్యతను ఇచ్చింది. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని అపాయింట్ చేసింది. ఇటీవలె కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. పురంధేశ్వరికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం.

IPL_Entry_Point