Hyderabad Gang Rape: భాగ్య నగరంలో ఘోరం, దళిత బాలికపై సామూహిక అత్యాచారం-ganjai gang anarchy gang rape of minor girl in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Gang Rape: భాగ్య నగరంలో ఘోరం, దళిత బాలికపై సామూహిక అత్యాచారం

Hyderabad Gang Rape: భాగ్య నగరంలో ఘోరం, దళిత బాలికపై సామూహిక అత్యాచారం

HT Telugu Desk HT Telugu
Aug 22, 2023 01:01 PM IST

Hyderabad Gang Rape: తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఘటనతో మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. గంజాయి మత్తులో ఎనిమిది మంది నిందితులు దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు.

హైదరాబాద్‌లో దారుణం, దళిత బాలికపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం, దళిత బాలికపై సామూహిక అత్యాచారం

Hyderabad Gang Rape: హైదరాబాద్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న అక్కా తమ్ముళ్లపై గంజాయి ముఠా దాడి చేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తమ్ముడి ఎదుటే యువతిపై దారుణానికి తెగబడ్డారు. మీర్‌పేట ప్రాంతంలో దళిత బాలికపై జరిగిన దుర్మార్గం అందరిని కలిచి వేసింది. బాధిత యువతి ఇంటికి సమీపంలో ఉంటున్న వారే వారిపై దాడికి పాల్పడినట్లు గుర్తించారు.

హైదరాబాద్‌ లాల్‌బజార్‌కు ప్రాంతానికి చెందిన 16ఏళ్ల బాలిక తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోయారు. తమ్ముడితో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క వరుసయ్యే మహిళ దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాధిత బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఆమె తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తుంటాడు.

సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది యువకులు వారి ఇంట్లోకి చొరబడ్డారు. గంజాయి మత్తులో ఉన్న నిందితులు బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించి భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు బాలిక తమ్ముడితో పాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బయటకు వెళ్లకుండా బెదిరించారు.

బాలికను తీసుకెళ్లిన వారిలో ముగ్గురు ఆమెను కత్తితో బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాధిత బాలికను సఖి కేంద్రానికి తరలించారు.

బాలిక నివాసముండే భవనంలోని కింది అంతస్తులో ఉండే టైసన్‌‌తో పాటు, మంగళ్‌హాట్‌కు చెందిన రౌడీషీటర్‌ అబేద్‌ లాలా నిందితుల్లో ఉన్నట్లు బాధితురాలి సోదరుడు చెప్పాడు. మరో ఇద్దరు నిందితులు కూడా తమ నివాసానికి సమీపంలోనే ఉంటారని పోలీసులకు తెలిపాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు

మరోవైపు బాలికపై సామూహిక అత్యాచారం నగరంలో సంచలనం సృష్టించింది. పట్టపగలు బాలికపై జరిగిన అన్యాయంపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. నందనవనం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాలికకు న్యాయం చేయాలని కోరితే పోలీసులు అడ్డుకోవడంపై మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేయాలని, బాలికను ప్రభుత్వం ఆదుకోవాలని, హైదరాబాద్‌ గంజాయికి అడ్డాగా మారిందని మహిళా సంఘాలు ఆరోపించాయి. నందనవనం ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని ఆరోపించారు. మహిళా సంఘాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

IPL_Entry_Point