SabitaOn Paper Leak: పేపర్‌ లీక్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందన్న మంత్రి సబితా-education minister sabitha indra reddy says paper leak on whatsapp was the instigation of bjp leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sabitaon Paper Leak: పేపర్‌ లీక్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందన్న మంత్రి సబితా

SabitaOn Paper Leak: పేపర్‌ లీక్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందన్న మంత్రి సబితా

HT Telugu Desk HT Telugu
Apr 05, 2023 10:42 AM IST

SSC Paper Leak: తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. పేపర్‌ లీక్ బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. పరీక్షలు మొదలైన తర్వాతే పేపర్ బయటకు వచ్చిందంటే దానికి కారణం ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు.

పేపర్‌ లీక్‌ వ్యవహారం బీజేపీ కుట్రేనని ఆరోపించిన సబితా ఇంద్రారెడ్డి
పేపర్‌ లీక్‌ వ్యవహారం బీజేపీ కుట్రేనని ఆరోపించిన సబితా ఇంద్రారెడ్డి

SabitaOn Paper Leak: తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. పదో తరగతి ప్రశ్నా పత్రాల విషయంలో జరిగిన సంఘటనలు బాధాకరమన్నారు. 5లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారని, వారంతా తొలిసారి బోర్డు పరీక్షలు రాస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. విద్యార్ధుల్ని, తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురి చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాక ఓ ప్రశ్నాపత్రాన్ని ఫోటోలు తీసి వాట్సాప్‌లో సర్క్యూలేట్ చేసి హడావుడి చేశారని ఆరోపించారు. దీని వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణపై నెల రోజుల్నుంచి ప్రతి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి జిల్లాలో పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించడానికి పేపర్‌ లీక్ పేరుతో కుట్ర పన్నారని ఆరోపించారు.

ప్రశ్నాపత్రాలు ఫోటోలు తీసి సర్క్యూలేట్ చేయడం ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాలు సర్క్యూలేట్ చేయడం ద్వారా రాజకీయ కోణంలో లబ్ది పొందడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. దీని వల్ల తల్లిదండ్రులు, విద్యార్ధులు ఆందోళనకు గురయ్యారని, విద్యార్ధుల భవిష్యత్తుతో నీచ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన సిబ్బందిని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. 9మంది జవాబు పత్రాలు మిస్ అయిన ఘటనలో పోస్టల్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రిగా తాను వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్ అనుమతించొద్దని ఆదేశాలిచ్చామని చెప్పారు.పరీక్షల్లో చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా 50వేల మంది సిబ్బంది పరీక్షల నిర్వహణ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. తొలిరోజు పరీక్ష ప్రశ్నాపత్రం బయటపెట్టిన ఉపాధ్యాయుల ఉద్దేశం ఏమిటనేది విచారణలో తేలుతుందన్నారు.

ప్రశ్నాపత్రాలు ఫోటోలు తీసి సర్క్యూలేట్ చేయడం వల్ల లాభం ఎవరికి అనేది అంతా ఆలోచించాలన్నారు. ప్రభుత్వం, పిల్లల భవిష్యత్తు ఆలోచించకుండా రాజకీయాల కోసమే ఇదంతా చేశారని ఆరోపించారు. సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించామని, విధుల నుంచి కూడా తొలగిస్తామన్నారు. తాండూరు,వరంగల్‌లో ఉద్యోగులను సస్పెండ్ చేశామని, పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారి మీద కూడా కేసులు పెట్టామని, పేపర్ లీక్ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారని చెప్పారు. సెల్‌ఫోన్‌లను ఎవరైనా సరే బయటే ఉంచాలని, మంత్రులు, అధికారుల ఫోన్లు కూడా అనుమతించడానికి వీల్లేదన్నారు.

విద్యార్ధులు, యువతలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు, తాము పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించాలని హితవు పలికారు. అనవసరంగా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే ఇతర మార్గాలు చాలా ఉంటాయని, కానీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచించారు.

పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకూడదనే ఆలోచన, బాధ్యత బీజేపీ నాయకులకు లేదా అని సబితా ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యం ఉంటే తాము అంగీకరించే వారిమన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులెవరన్నది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. ప్రశ్నాపత్రాల లీక్ చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని భావించారని ఆరోపించారు. పేపర్ లీక్ అంటూ రెండు గంటల్లో 142సార్లు పోలీసులకు ఫోన్లు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకున్నారని సబితా ప్రశ్నించారు. ఈ కుట్రల్ని పోలీసులు సాక్ష్యాలతో బయటపెడతారన్నారు.

మరోవైపు తెలంగాణలో పదో తరగతి పేపర్‌ లీక్‌ వ్యవహారంలో బండి సంజయ్‌ కుట్ర ఉందని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. హిందీ పేపర్ లీక్ చేసిన ప్రశాంత్ బండి సంజయ్ అనుచరుడిగా ఉన్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ది పొందడానికి, యువతను రెచ్చగొట్టి లబ్ది పొందడానికే పేపర్ లీక్ అంటూ హడావుడి చేస్తున్నారని ఎమ్మెల్యే రమేష్ ఆరోపించారు.

 

Whats_app_banner