banjarahills sexual assault case : పాఠశాల గుర్తింపు రద్దుకు విద్యాశాఖ ఆదేశాలు
banjarahills student rape case: బంజారాహిల్స్ స్కూల్ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
banjarahills student rape case updates: బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో LKG చదువుతున్న నాలుగేళ్ల బాలికపై.. ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగికదాడి ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. లైంగిక దాడికి పాల్పడిన కేసులో బంజారాహిల్స్ లోని కారు డ్రైవర్ బీమన రజనీకుమార్ (34), ప్రిన్సిపల్ మాధవి (55) ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కి తరలించారు.
మంత్రి ఆదేశాలు….
ఈ ఘటనపై రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. LKG బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్‌లోని పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. భద్రతా పరమైన చర్యలు ప్రభుత్వానికి సూచించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇతర పాఠశాలల్లో విద్యార్థులను సర్దుబాటు చేయాలని చెప్పారు.
బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల ఎల్‌కేజీ చిన్నారిపై ప్రిన్సిపాల్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు, కొద్దిరోజులుగా ఇలా చేయటంతో చిన్నారి నీరసంగా ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. అసలు విషయం బయటికి రావటంతో... తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం నేరుగా తమ స్నేహితులు, బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడే ఉన్న డ్రైవర్‌ని చితకబాదారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు కూడా మూడు రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
చిన్నారి తల్లి ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. డ్రైవర్ తో ప్రిన్సిపల్ మాధవి నిర్లక్ష్యం వల్లే దారుణం జరిగిందని ఆమెపై కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. రజనీకుమార్ బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.