sridhar babu appointed as aicc general secretary తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు.. ఆ పార్టీ హైకమాండ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన్ను ఏఐసీసీ కార్యదర్శిగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. కర్ణాటక రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి సహాయకంగా ఇంచార్జి కార్యదర్శి బాధ్యతలు ఆయనకు అప్పగించారు. శ్రీధర్‌బాబుతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన మరో నలుగురినీ కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్ లు ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్నారు. తాజాగా శ్రీధర్ బాబుకు ఛాన్స్ రావటంతో...ఈ సంఖ్య 4కు చేరింది. మరోవైపు శ్రీధర్ బాబుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సన్మానించారు. ఇతర నేతలు అభినందన తెలిపారు.
ఏఐసీసీ కార్యదర్శిగా నియమించటం పట్ల శ్రీధర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పలు పదవులు నిర్వహించారు. మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1999, 2004, 2009, 2018 నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏఐసీసీ కార్యదర్శిగా శ్రీధర్ బాబు నియామకం పట్ల మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.