Komatireddy : రాజగోపాల్‌ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్‌లో దుమారం…..-congress hi command may issue notices to komatireddy rajagoapl reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Congress Hi Command May Issue Notices To Komatireddy Rajagoapl Reddy

Komatireddy : రాజగోపాల్‌ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్‌లో దుమారం…..

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 11:45 AM IST

టీ పీసీసీ కంట్లో నలుసులా తయారైన నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)

పార్టీ మారుతారని జోరుగా ప్రచారం ఓ వైపు, పార్టీ మారడం లేదంటూ కోమటిరెడ్డి దాగుడుమూతల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం భావిస్తోంది. గత వారం రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను వీడేందుకు కోమటిరెడ్డి ఏర్పాట్లు చేసుకున్నా చివరి నిమిషంలో దానిని రద్దు చేసుకున్నారు. గత వారం ఝర్ఖండ్‌ ఎంపీ నిషికాంత్ దూబేతో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారుతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్ని కోమటిరెడ్డి ఖండించారు.

ట్రెండింగ్ వార్తలు

పార్టీ మారుతున్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే కోమటిరెడ్డి టీపీసీసీ నేతల్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన వారు పార్టీని నడుపుతున్నారని రేవంత్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని అభిప్రాయపడ్డారు. సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ సంబంధం లేదని, తమ బంధం కుటుంబ వ్యవహారమని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించడానికి చెరో పార్టీలో ఉంటే తప్పేమిటని కూడా రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ఉద్దేశపూర్వకంగానే పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని విహెచ్‌ వంటి నేతలు నిలదీస్తున్నారు.

మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని పీసీసీ నుంచి ఓ నివేదికను ఏఐసీసీకి పంపారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాాల్‌ రెడ్డిపై పీసీసీ స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఏఐసీసీ జోక్యం చేసుకోవాలని తెలంగాణ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఏఐసీసీ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో రాజగోపాల్ రెడ్డి వివరణ కోరుతారని చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్