Casino Scam : క్యాసినో స్కాంలో టిఆర్‌ఎస్‌ నేతలపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్….-congress allegations on trs leaders had links with casino gambling ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Casino Scam : క్యాసినో స్కాంలో టిఆర్‌ఎస్‌ నేతలపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్….

Casino Scam : క్యాసినో స్కాంలో టిఆర్‌ఎస్‌ నేతలపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్….

HT Telugu Desk HT Telugu
Aug 02, 2022 06:24 AM IST

చీకోటి ప్రవీణ్ అక్రమ కార్యకలాపాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్ చేసారు. చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యాపారం, ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో టీఆర్‌ఎస్ నేతల ప్రమేయంపై వెంటనే విచారణ జరిపించాలని ఈడీని కోరారు. ప్రవీణ్ చీకటి దందాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

దాసోజు శ్రవణ్, ఏఐసిసి అధికార ప్రతినిధి
దాసోజు శ్రవణ్, ఏఐసిసి అధికార ప్రతినిధి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో తెలంగాణకు చెందిన టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులకు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేత శ్రవణ్‌ ఆరోపించారు. మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డితో క్యాసినో సూత్రధారి చికోటి ప్రవీణ్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలను బయటపెట్టారు. వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను మీడియా ముందు బయటపెట్టారు. మెదక్ డీసీసీబీ కొండపాక బ్రాంచ్ ఫై దాడులు చేసి, బ్యాంకు లాకర్లలో డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి దాచిపెట్టిన చీకోటి చీకటి పత్రాలను ప్రజల ముందు బయటపెట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌‌కు విజ్ఞప్తి చేశారు.

చీకోటి అంశం ఫై బిజెపి మౌనంగా ఉండడంపై దాసోజు శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకోటి చీకటి దందాలో అధికార పార్టీ టిఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపించారు. చీకోటి ప్రవీణ్ అక్రమాస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని, చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యాపారం, ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో టీఆర్‌ఎస్ నేతల ప్రమేయంపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.

చిన్న కిరాణా కొట్టు నడిపించే చీకోటి ప్రవీణ్, ఏడు ఎనిమిది దేశాల్లో క్యాసినో నడిపించే స్థాయికి చేరడాని, ప్రత్యేక ఫ్లైట్ లు, ప్రత్యేక హెలికాఫ్టర్లు మెయింటెయిన్ చేస్తున్నాడంటే దీని వెనుక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. చీకోటి ప్రవీణ్ చీకటి దందాలపై హోంమంత్రి, ఐటి మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్ రెడ్డి, చీకోటి ప్రవీణ్ ల మధ్య ఉన్న బంధాన్ని మీడియా ముందు బయటపెట్టారు.

చీకోటి ప్రవీణ్ చీకటి దందా బయటకు రాగానే మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ప్రవీణ్‌కు సంబదించిన కీలక పత్రాలను , భారీగా నగదును ఓ సూట్‌కేసులో పెట్టి మెదక్ జిల్లా కొండపాక డీసీసీబీ బ్రాంచ్‌లోని లాకర్‌లో దాచిపెట్టాడని, ఈ వ్యవహారం బయటకు వెళ్లకుండా అక్కడ ఉన్న సీసీ కెమెరాలను అఫ్ చేయించాడని ఆరోపించారు.మరో సూట్‌కేసు ను అదే గ్రామంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కీలక నేత ఇంట్లో దాచినట్లు ప్రామాణికమైన సమాచారం ఉందని, కొండపాక డీసీసీబీ బ్రాంచ్‌పై తక్షణమే దాడి చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను డిమాండ్ చేసారు.

తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కూలి పనులు చేసుకుంటున్నారని, హాస్టల్స్ లలో విద్యార్థులు పురుగుల అన్నం తింటుంటే టీఆర్‌ఎస్ నాయకులు ప్రజా ధనం దోచుకున్న డబ్బుతో పలు దేశాల్లో క్యాసినోలు నిర్వహిస్తుండడం బాధాకరమని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రాజెక్ట్‌ల పేరుతో కమిషన్ నొక్కేస్తూ కొంతమంది టిఆర్ఎస్ నేతలు క్యాసినో ఆడుతూ తెలంగాణ రాష్ట్ర పేరును చెడగొడుతున్నారని దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు.

విద్యార్థులు, యువకుల బలిదానాలతో ఏర్పాటైన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అనైతిక, అక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ . రాహుల్ గాంధీలకు క్లిన్ చిట్ వచ్చినా ఈడీని ఉసిగొలిపి సోనియా, రాహుల్ గాంధీ లను విచారణ జరిపిస్తున్నారని, పక్కా ఆధారాలతో చికోటి ప్రవీణ్ క్యాసినో దందాలో టిఆర్ఎస్ నేతల హస్తం ఉందని తేలినా బిజెపి ఎందుకు మౌనంగా ఉందని శ్రవణ్‌ ప్రశ్నించారు.

IPL_Entry_Point

టాపిక్