TS Medical Colleges వైద్య రంగంలో భారతదేశ మణిహారంగా తెలంగాణ…కేసీఆర్‌-cm kcr says telangana is role model for entire country in health education ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Says Telangana Is Role Model For Entire Country In Health Education

TS Medical Colleges వైద్య రంగంలో భారతదేశ మణిహారంగా తెలంగాణ…కేసీఆర్‌

B.S.Chandra HT Telugu
Nov 15, 2022 12:53 PM IST

TS Medical Colleges తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని కేసీఆర్‌ చెప్పారు. ఒకప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన తెలంగాణకు స్వరాష్ట్రం వచ్చాక అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. 8 కాలేజీలను ప్రారంభించుకోవడంపై కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొత్త మెడికల్ కాలేజీలతో రాష్ట్రంలో 1150 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని కేసీఆర్ చెప్పారు.

వర్చువల్ పద్ధతిలో వైద్య కళాశాలలు ప్రారంభించిన కేసీఆర్
వర్చువల్ పద్ధతిలో వైద్య కళాశాలలు ప్రారంభించిన కేసీఆర్

TS Medical Colleges వైద్య రంగంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలంగాణ సిఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటైన నూతన మెడికల్ కాలేజీలను కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో నాలుగైదు మెడికల్ కాలేజీలు ఉంటే గతంలోనే నాలుగు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. గతంలో ఉన్న కాలేజీలకు అదనంగా 8 కొత్త కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

ప్రభుత్వ రంగంలో మహబూబ్ నగర్‌, నల్గొండ, సిద్ధిపేట, సూర్యాపేటలో నాలుగు కాలేజీలు ప్రభుత్వ రంగంలో ప్రారంభించామని చెప్పారు. అవి విజయవంతంగా నడుస్తున్నాయని, కాలేజీలు బాగా నడుస్తున్నాయని చెప్పారు. వైద్య విద్యార్థులకు మరిన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణలో ఒకే రోజు ఎనిమది మెడికల్ కాలేజీలను ప్రారంభించడం గర్వ కారణంగా ఉందని, తనకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని సిఎం చెప్పారు. పాత వాటితో పాటు మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి,నాగర్ కర్నూలు, కొత్తగూడెం, సంగారెడ్డి,మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

మహబూబాబాద్‌, వనపర్తిలో ప్రభుత్వ వైద్య కాలేజీలు రావడానికి స్వరాష్ట్రాన్ని సాధించుకోవడమే కారణమని చెప్పారు. ఉద్యమకారులే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిస్తున్నారని, తెలంగాణలో వైద్య కళాశాలలు రావడం వెనుక ప్రముఖ ఉద్యమ కారుడిగా హరీష్‌ రావు కృషిని కేసీఆర్ అభినందించారు. కాలేజీలను వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సీఎస్‌, డిఎంఇ, హెల్త్ సెక్రటరీ, వీసీలతో పాటు వైద్య శాఖ సిబ్బందిని సిఎం ప్రత్యేకంగా అభినందించారు.

తెలంగాణలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీరావాలన్నారు. ప్రభుత్వ రంగంలో వచ్చే మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరిందని, 15 జిల్లాల్లో నూతన కాలేజీలు రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. రానున్న కాలంలో వాటికి కూడా మెడికల్ కాలేజీలు రావాల్సి ఉందన్నారు.రానున్న రెండేళ్లలో మిగిలిన కాలేజీలు కూడా ప్రారంభించుకోవాల్సి ఉందన్నారు. భగవంతుడి అనుగ్రహం ఉంటే వాటిని కూడా తానే ప్రారంభిస్తానని చెప్పారు.

ఒకప్పుడు 850 మెడికల్ సీట్లు గవర్నమెంట్ కాలేజీల్లో ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 2709 సీట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం మెడికల్ సీట్లు పెరిగాయని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణలో గతంతో పోలిస్తే మూడున్నర నాలుగురెట్లు మెడికల్ సీట్లు పెరిగాయని చెప్పారు. పీజీ మెడికల్ సీట్ల లభ్యత కూడా గణనీయంగా పెరిగాయని కేసీఆర్ చెప్పారు. గతంలో 515 పీజీ సీట్లు ఉంటే, ఇప్పుడు 1180 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 70 నుంచి 150కు పెరిగాయని చెప్పారు. మెడికల్, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయని చెప్పారు. నీట్‌లో పోటీ పడి విద్యార్ధులు మెడికల్ సీట్లు సాధిస్తున్నారని సిఎం చెప్పారు. పేద, దళిత, బలహీన వర్గాల ప్రజలకు ఉన్నత విద్యను చదవడానికి మంచి అవకాశాలు లభిస్తున్నాయని, సొంత రాష్ట్రాన్ని సాధించుకోవడమే దీనికి కారణమన్నారు.

వైద్య నిపుణులతో పాటు మెడికల్ సిబ్బంది జనాభా నిష్పత్తిలో ఉండటం అవసరమని దానికి తగ్గట్లుగా వైద్య సహాయక సిబ్బంది తగినంత మంది ఉండాలన్నారు. దానిని కూడా నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటుకు క్యాబినెట్‌ అమోదం తెలిపిందని చెప్పారు. 33 మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి జిల్లాల్లో యూనిఫాంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ వంటి ఇతర ప్రాంతాల్లో పారా మెడికల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. అన్ని ప్రాంతాల్లో వైద్య విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావుకు సూచించారు.

ఈ ఊరు, ఆ ఊరనే తేడా లేకుండా తెలంగాణ మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రతి ఊరు చెరువు బాగు పడ్డాయన్నారు. అన్ని ప్రాంతాలకు కవరేజ్ ఇచ్చేలా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ఒకే అసెంబ్లీ నియోజక వర్గంగా ఉన్నా గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఉన్నాయని వాటికి వేర్వేరుగా ములుగు, భూపాలపల్లి జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో ఎలాంటి భయోత్పాత పరిస్థితులు చూశామని, అమెరికా వంటి దేశాల్లో వైద్య అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, యూరోప్‌లో కూడా అదే పరిస్థితులు చూశామని, మనదేశంతో పాటు తెలంగాణలో కూడా కరోనా విపత్తు అనుభవాలను చవిచూశామన్నారు.

వర్చువల్ పద్ధతిలో మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్న కేసీఆర్
వర్చువల్ పద్ధతిలో మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్న కేసీఆర్

భవిష్యత్‌ ముప్పును ఎదుర్కోడానికే…..

రాబోయే రోజుల్లో ఇలాంటి వైరస్‌లు మానవాళిని పట్టి పీడిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరించారని, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో వైద్య సదుపాయాలు ఉంటాయో, అక్కడ తక్కువ నష్టం ఉంటుందని నిపుణులు సూచించారని, తెలంగాణ రాష్ట్రానికి అలాంటి ముప్పు రాకుండా చూడ్డానికి వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

కరోనా వంటి వైరస్‌లు వచ్చిన ఎదుర్కొనేలా విద్యార్ధులను భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని, వేల కోట్ల రుపాయలు వైద్య విద్యార్ధుల్ని తయారు చేయడం కోసం ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. డబ్బున్న వారికి వైద్యం ఎలాగైనా అందుతుందని పేదల కోసమే ప్రభుత్వ వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్ధులు ఏ సమస్య ఉన్నా డైనమిక్ మినిస్టర్ హరీష్‌ రావు, డిఎంఇల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

వైద్య రంగంలో తెలంగాణ మోడల్‌ను దేశం మొత్తం అనుసరిస్తోందని చెప్పారు. ఎన్ని వేల కోట్ల రుపాయలు ఖర్చు చేయడానికి అయినా తెలంగాణ ప్రభుత్వ వెనకాడదని చెప్పారు. అన్ని జిల్లాల్లో పారా మెడికల్ కాలేజీలను ప్రారంభించే చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని జిల్లాల్లో పారామెడికల్ కాలేజీలు వచ్చేలా చూడాలని చెప్పారు. వైద్య శాఖ మంత్రి మెడికల్ కాలేజీలను తరచుగా వాటిని సందర్శించాలని సూచించారు. మెడికల్ కాలేజీల మౌలిక సదుపాయల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకే రోజు ఎనిమిది కాలేజీలను ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారని చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రక్రియ విజయం సాధించాలని కోరారు.

IPL_Entry_Point

టాపిక్