CM KCR Tour: వర్ష ప్రభావిత ప్రాంతాలకు కేసీఆర్..నేడు నాలుగు జిల్లాల్లో పర్యటన-chief minister kcr will visit four districts where crops have been damaged due to untimely rains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Chief Minister Kcr Will Visit Four Districts Where Crops Have Been Damaged Due To Untimely Rains

CM KCR Tour: వర్ష ప్రభావిత ప్రాంతాలకు కేసీఆర్..నేడు నాలుగు జిల్లాల్లో పర్యటన

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 09:59 AM IST

CM KCR Tour: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసేపట్లో జిల్లాల్లో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న జిల్లాల్లో రైతుల్ని సిఎం పరామర్శిస్తారు. ప్రగతి భవన్ నుంచి బయలుదేరి నాలుగు జిల్లాల్లో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం నష్టంపై అధికారులతో సమీక్షిస్తారు.

నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్న  సీఎం కేసీఆర్
నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR Tour: అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. గత వారం కురిసిన వడగండ్ల వర్షాలతో కడగండ్ల పాలైన రైతంగాన్ని ఊరడించేందుకు సిఎం కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. వారం రోజులుగా అకాల వర్షాలు సృష్టించిన బీభత్సానికి తెలంగాణలోని పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.

ట్రెండింగ్ వార్తలు

వర్షాలకు పంటల్ని కోల్పోయిన రైతాంగాన్ని పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని నింపటానికి సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటన చేయనున్నారు. రైతుల్ని పరామర్శించేందుకు గురువారం ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.

వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతినడంతో రైతాంగం నష్టపోయారు. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు.

రైతులు నష్టపోయిన పంటల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. భారీ వర్షాలు కురిసిన వెంటనే కేసీఆర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కూడిన బృందం వికారాబాద్‌ జిల్లాల్లో పర్యటించింది. పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు.

సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. తెలంగాణలో వారం రోజులుగా వడగండ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మొక్కజొన్నతో పాటు భారీస్థాయిలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పంట నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు కేసీఆర్‌కు అందించారు. నివేదికను పరిశీలించిన సీఎం నేరుగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.

బేగంపేట నుంచి ఖమ్మం పర్యటనకు…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రామాపురంతో పాటు గార్లపాడు, గోవిందాపురం, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాల్లో గురువారం సీఎం కేసీఆర్‌ పర్యటిస్తారు. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 23,116 ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. చొప్పదండి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 11వేల 409 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. రామడుగు మండలంలోనే 5 వేల 825 ఎకరాలున్నాయి. ఈ 3 మండలాల్లోనే 7 వేల 695 మంది రైతులు నష్టపోతే ఒక్క రామడుగు మండలంలోనే 4 వేల 53 మంది రైతులు నష్టపోయారు.

వరంగల్‌ జిల్లాలో దుగ్గొండి మండలం అడవిరంగాపురంతో పాటు పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ గురువారం పరిశీలించనున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు గురువారం సీఎం కేసీఆర్‌ రానున్నారు. వడగండ్లవానతో ఇక్కడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

సీఎం టూర్‌ షెడ్యూల్‌

ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేట విమానాశ్రయానికి కేసీఆర్ బయలుదేరుతారు.

10.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

10.15 గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.

11.15 గంటలకు ఖమ్మం జిల్లా బొనకల్‌ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.

11.45 గంటలకు రామపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్‌ బయలుదేరుతారు.

12.10 గంటలకు మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.

12.40కి రెడ్డికుంట తండా నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.

12.55 గంటలకు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు అడవిరంగాపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.

1.55 గంటలకు కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రపూర్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.

2.30 గంటలకు హెలిక్యాప్టర్‌లో లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు.

3.15 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.

IPL_Entry_Point

టాపిక్