CEC Tour In TS: తెలంగాణలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన-central election commission officials visit telangana for three days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Central Election Commission Officials Visit Telangana For Three Days

CEC Tour In TS: తెలంగాణలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన

HT Telugu Desk HT Telugu
Oct 03, 2023 06:16 AM IST

CEC Tour In TS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని 17మంది అధికారుల బృందం రాష్ట్రానికి వస్తున్నారు. మూడ్రోజుల పాటు నిర్వహించే విస్తృత సమీక్ష కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం
కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం (HT_PRINT)

CEC Tour In TS: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాక చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు పలు సమీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు హోటల్ తాజ్‌ కృష్ణలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో భేటీ అవుతారు.అన్ని రాజకీయ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులను భేటీకి ఆహ్వానించారు. సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు ఎన్నికల విధుల్లో భాగమయ్యే దాదాపు 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో భేటీ అవుతారు. సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రజెంటేషన్ ఇస్తారు.

బుధవారం ఉదయం ఆరున్నర నుంచి ఏడింటి వరకు ఎన్నికల నేపథ్యంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సైక్లోథాన్‌, వాకథాన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఏడింటి వరకు హోటల్ తాజ్‌ కృష్ణలో జిల్లా ఎన్నికల అధికారులు,33జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, కమిషనర్లతో సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

గురువారం ఉదయం 9.15నుంచి 10.05వరకు గచ్చిబౌలిలోని టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్‌లోని టెక్‌ మహీంద్రా ఆడిటోరియంలో స్వీప్ కార్యక్రమంపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొత్త ఓటర్లు, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువతతో అధికారులు సమావేశం అవుతారు. ఉదయం 11 నుంచి 12గంటల వరకు చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో తాజ్ కృష్ణ హోటల్లో భేటీ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.

మరోవైపు సీఈసీ పర్యటన తర్వాత వారం పదిరోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point