BJP and TDP : చంద్రబాబుతో ఆ భేటీ లేనట్టే…..!-amit sha may not meet tdp president chandra babu naidu in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Amit Sha May Not Meet Tdp President Chandra Babu Naidu In Hyderabad

BJP and TDP : చంద్రబాబుతో ఆ భేటీ లేనట్టే…..!

HT Telugu Desk HT Telugu
Aug 21, 2022 01:21 PM IST

మునుగోడు బహిరంగ సభ తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ వెళ్లే కేంద్ర మంత్రి అమిత్‌ షా, వెళ్ళే దారిలో ఫిలిం సిటీకి వెళ్లనుండటం రకరకాల ప్రచారాలకు కారణమైంది. ఫిలిం సిటీలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కూడా అమిత్‌షాతో భేటీ అవుతారని విస్తృత ప్రచారం జరిగింది.

అమిత్ షాతో చంద్రబాబు భేటీ లేనట్టే
అమిత్ షాతో చంద్రబాబు భేటీ లేనట్టే (HT_PRINT)

అమిత్‌షాతో చంద్రబాబు భేటీకి ఏర్పాట్లు జరిగాయని, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ సుజనా చౌదరి రాయబారంతో ఇద్దరి భేటీ మార్గం సుగమం అయ్యిందని వార్తలు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తుందని, ఆ తర్వాత వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాలు కలిసి పోటీ చేస్తాయని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఫిలిం సిటీ భేటీలో అమిత్ షాతో చంద్రబాబు కలిసే అవకాశాలు లేవని బీజేపీ ప్రకటించింది.

గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత తెలుగు దేశం పార్టీ మహాకూటమిగా కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పునరాలోచనలో పడింది. మళ్లీ బీజేపీకి చేరువయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సబ్యులు బీజేపీలో చేరినా చంద్రబాబు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు.

మూడేళ్లుగా బీజేపీలో విలీనమైన టీడీపీ ఎంపీలు ఇటీవల పదవీ విరమణ కూడా చేశారు. రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న టీడీపీ ఏ అవకాశం వచ్చిన వదులుకోకూడదని భావిస్తోంది. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం వైసీపీ పన్నిన ఉచ్చులో తొందరపడి బీజేపీకి గుడ్‌బై చెప్పేసి తప్పు చేశామని ఇప్పుడు బాధపడుతోంది. ఏపీలో వైసీపీ బలంగా ఉండటం, తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఢీకొట్టే పరిస్థితులు లేకపోవడంతో బీజేపీకి దగ్గరవ్వాలని కొన్నాళ్లుగా ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.

దాదాపు మూడున్నరేళ్లుగా బీజేపీని పల్లెత్తు మాట అనడానికి కూడా చంద్రబాబు సాహసించలేదు. ఈ క్రమంలో మునుగోడులో వచ్చిన ఉప ఎన్నికలను అందిపుచ్చుకోవాలని టీడీపీ భావిస్తోంది. వీలైతే బీజేపీ ఎన్ని కండిషన్లు పెట్టినా స్నేహానికి సై కొట్టాలని భావించింది. అమిత్ షా ఫిలిం సిటీలో ఆగే 45 నిమిషాల వ్యవధిలో రాజకీయంగా తమకు అనువుగా మార్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే అమిత్ షా ఫిలిం సిటీ పర్యటనలో ఎవరిని కలుస్తారనే విషయంలో స్పష్టత లేదు. ఆయన రామోజీరావుతో భేటీ అవుతారని చెబుతున్నా చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. బీజేపీతో రామోజీకి ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఈ భేటీ కీలకం కావొచ్చు. మరోవైపు టీడీపీ-బీజేపీల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత తీసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. అమిత్‌ షా - చంద్రబాబు మధ్య భేటీ జరగకపోయినా సానుకూల వాతావరణం కల్పించే ప్రయత్నాలు జరిగినా జరగొచ్చు.

IPL_Entry_Point

టాపిక్