Women's IPL from next year: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్: గంగూలీ-womens ipl to commence from next year says bcci president saurav ganguly ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Women's Ipl From Next Year: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్: గంగూలీ

Women's IPL from next year: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్: గంగూలీ

Hari Prasad S HT Telugu
Sep 22, 2022 02:31 PM IST

Women's IPL from next year: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ ప్రారంభించబోతున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించారు. గురువారం (సెప్టెంబర్‌ 22) ఆయన రాష్ట్ర క్రికెట్‌ అసోసియేష్లకు ఓ లేఖ రాశారు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Photo by Samir Jana/ Hindustan Times)

Women's IPL from next year: మహిళల ఐపీఎల్‌ వచ్చేస్తోంది. వచ్చే సీజన్‌ నుంచి వుమెన్స్‌ ఐపీఎల్‌ ప్రారంభించబోతున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురువారం (సెప్టెంబర్‌ 22) వెల్లడించారు. ఇక కొవిడ్‌ కూడా పూర్తిగా తగ్గుముఖ పట్టడంతో వచ్చే ఏడాది నుంచి మెన్స్‌ ఐపీఎల్‌ కూడా హోమ్‌, అవే పద్ధతిలో జరగనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రాల అసోసియేషన్లకు గంగూలీ రాసిన లేఖలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఐపీఎల్‌.. ఇక ఎప్పటిలాగే..

గత మూడు సీజన్లుగా ఐపీఎల్‌ దేశం బయట లేదంటే ఇండియాలోనే పరిమిత వేదికల్లో జరుగుతోంది. కొవిడ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఐపీఎల్‌ దేశంలోని చాలా మంది క్రికెట్‌ అభిమానులకు దూరంగా జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మెరుగవడంతో వచ్చే ఏడాది నుంచి ఇండియాలోనే, గతంలో నిర్వహించినట్లుగా హోమ్‌, అవే పద్ధతిలోనే జరుగుతుందని గంగూలీ ఆ లేఖలో స్పష్టం చేశారు.

2022 నుంచి ఐపీఎల్‌లో పది టీమ్స్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌ నుంచి ఈ పది టీమ్స్‌ తమ హోమ్‌గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు ఆడటంతోపాటు ప్రత్యర్థుల దగ్గరా ఆడతాయని దాదా చెప్పారు. అటు డొమెస్టిక్‌ క్రికెట్‌లో కూడా అన్ని ఏజ్‌గ్రూప్‌ల టోర్నీలు దేశవ్యాప్తంగా జరుగుతాయని కూడా అందులో స్పష్టం చేశారు.

రంజీ ట్రోఫీ కూడా ఎప్పటిలాగే..

దేశవాళీ క్రికెట్‌లో ప్రధాన టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కూడా ఎప్పటిలాగే హోమ్‌, అవే పద్ధతిలో జరుగుతుందని కూడా గంగూలీ తెలిపారు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ డిసెంబర్‌ 13 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్‌లో రెండు ఇరానీ కప్‌లు జరుగుతాయని కూడా చెప్పారు. తొలి ఇరానీ ట్రోఫీలో 2019-20 రంజీట్రోఫీ విజేత అయిన సౌరాష్ట్ర ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి 5 వరకూ రాజ్‌కోట్‌లో రెస్టాఫ్‌ ఇండియాతో తలపడుతుంది.

ఇక ఈ ఏడాది రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్‌ కూడా తొలిసారి ఇరానీ ట్రోఫీలో పోటీపడనుంది. మధ్యప్రదేశ్‌, రెస్టాఫ్‌ ఇండియా మధ్య ఇండోర్‌లో వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 5 వరకూ ఇరానీ ట్రోఫీ జరుగుతుందని గంగూలీ తెలిపారు.

వుమెన్స్‌ ఐపీఎల్‌ 2023 నుంచే..

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వుమెన్స్‌ ఐపీఎల్‌.. 2023 నుంచే ప్రారంభం కానున్నట్లు ఈ లేఖలో గంగూలీ వెల్లడించారు. "వుమెన్స్‌ ఐపీఎల్‌పై ప్రస్తుతం బీసీసీఐ పని చేస్తోంది. వచ్చే ఏడాది మొదట్లోనే తొలి సీజన్‌ ప్రారంభించాలని అనుకుంటున్నాం. రానున్న రోజుల్లో దీని గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తాం" అని గంగూలీ చెప్పారు.

ఇక మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో అండర్‌15 కేటగిరీలోనూ బాలికలకు వైట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించడానికి బీసీసీఐ ప్లాన్‌ చేస్తోంది. ఈ సీజన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. అంతర్జాతీయంగా మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోందని, మన టీమ్‌ కూడా బాగా రాణిస్తోందని ఆ లేఖలో గంగూలీ అన్నారు. నేషనల్, ఇంటర్నేషనల్‌ లెవల్లో రాణించడానికి వీలుగా బాలికలకు ఈ అండర్‌15 టోర్నీ ఉపయోగపడుతుందని దాదా చెప్పారు.

WhatsApp channel