Ravi Shastri on Gabba Test Win: టెస్టుల్లో అతి గొప్ప విజయానికి రెండేళ్లు.. ఆ ముగ్గురినీ గుర్తు చేసుకున్న రవిశాస్త్రి
Ravi Shastri on Gabba Test Win: టెస్టుల్లో అతి గొప్ప విజయానికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఆస్ట్రేలియాలోని గబ్బా కోటను జయిస్తూ టీమిండియా సాధించిన చిరస్మరణీయ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ముగ్గురు ప్లేయర్స్ పై ప్రశంసలు కురిపించాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.
Ravi Shastri on Gabba Test Win: టెస్ట్ క్రికెట్ లో టీమిండియా సాధించిన అతి గొప్ప విజయంగా ఆ గెలుపు అభివర్ణిస్తారు. ఆస్ట్రేలియా గడ్డపై వాళ్లకు మూడు దశాబ్దాలుగా పెట్టని కోటలా ఉన్న గబ్బా స్టేడియంలో ఇండియన్ టీమ్ సాధించిన స్ఫూర్తిదాయక విజయానికి గురువారం (జనవరి 19)తో రెండేళ్లు పూర్తయ్యాయి. 2021లో సరిగ్గా ఇదే రోజు రిషబ్ పంత్ వీరోచిత ఇన్నింగ్స్ ఇండియన్ క్రికెట్లో మరుపురాని విజయాన్ని అందించింది.
ఈ సందర్భంగా అప్పుడు కోచ్ గా ఉన్న రవిశాస్త్రి గబ్బా విజయాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. ఈ గెలుపులో కీలకపాత్ర పోషించిన ముగ్గురు ప్లేయర్స్ ను అతడు గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ చారిత్రక సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో ఇద్దరు ఆటగాళ్ల పేర్లను చేరుస్తూ మరో ట్వీట్ చేశాడు.
'''శుభ్‌మన్ గిల్ పునాది వేశాడు. మహ్మద్ సిరాజ్ కీలకమైన సమయంలో వికెట్లు తీశాడు. రిషబ్ పంత్ ముగించాడు. త్వరలోనే ఈ ఇద్దరితో రిషబ్ పంత్ చేరతాడని ఆశిస్తున్నా" అంటూ ఆ విజయం తాలూకు మధుర క్షణాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.
ఇక ఆ ట్వీట్ లో తాను మరచిపోయిన వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ ల పేర్లను కూడా మరో ట్వీట్ లో శాస్త్రి చేర్చాడు. సిరీస్ విజయంలో వీళ్ల పాత్రను మరవలేమని అతడు అన్నాడు. ఈ చారిత్రక విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండోసారీ ఇండియా టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇప్పటికీ ఇండియా దగ్గరే ఉంది. దానిని తిరిగి పొందాలన్న పట్టుదలతో వచ్చే నెలలో ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు వస్తోంది.
2020-21లో జరిగిన టెస్ట్ సిరీస్ లో నాలుగో టెస్ట్ సమయానికి రెండు టీమ్స్ 1-1తో సమంగా ఉన్నాయి. చివరి టెస్ట్ 32 ఏళ్లుగా ఆస్ట్రేలియాకు ఓటమంటే తెలియని బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో ఉండటంతో ఇండియా గెలవడం అసాధ్యమనుకున్నారు. కానీ ఆ మ్యాచ్ లో 329 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
శుభ్‌మన్ గిల్ 91 రన్స్ చేయగా.. చివరి వరకూ క్రీజులో నిలిచి 89 పరుగులతో టీమ్ కు విజయాన్ని ఖాయం చేశాడు రిషబ్ పంత్. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక శార్దూల్ ఠాకూర్ తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లతో విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఇండియా 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది.
సంబంధిత కథనం