Virat Kohli IPL Record: పని అయిపోయిందన్నారు.. పవర్ ఇంకా ఇంకా తగ్గలేదు.. కోహ్లీ నిజంగానే రియల్ కింగ్..!-virat kohli to became highest centuries in ipl history ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Ipl Record: పని అయిపోయిందన్నారు.. పవర్ ఇంకా ఇంకా తగ్గలేదు.. కోహ్లీ నిజంగానే రియల్ కింగ్..!

Virat Kohli IPL Record: పని అయిపోయిందన్నారు.. పవర్ ఇంకా ఇంకా తగ్గలేదు.. కోహ్లీ నిజంగానే రియల్ కింగ్..!

Maragani Govardhan HT Telugu
May 22, 2023 08:36 AM IST

Virat Kohli IPL Record: గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో విజృంభించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గా అతడు రికార్డు సృష్టించాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

Virat Kohli IPL Record: ఐపీఎల్ 2023 ప్లేఆప్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైన విషయం తెలిసిందే. బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు చేతులెత్తేయడంతో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించి జట్టుకు మెరుగైన స్కోరు అందించినప్పటికీ ఓటమి నుంచి మాత్రం కాపాడలేకపోయాడు. అయితే ఈ శతకంతో కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కోహ్లీ మొత్తంగా 7 సెంచరీలు నమోదు చేశాడు. ఫలితంగా ఇప్పటి వరకు ఆరు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్‌లో 12 వేల పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. గుజరాత్‌తో ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 101 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 13 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.

కోహ్లీ ఐపీఎల్ సెంచరీలు..

- 2016లో గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ సెంచరీ(100*)

- 2016లో రైజింగ్ పుణెపై శతకం(108*)

- 2016లో గుజరాత్ లయన్స్‌పై సెంచరీ(109)

- 2016లో పంజాబ్‌పై శతకం(113)

-2019లో కోల్‌కతాపై సెంచరీ(100)

- 2023లో హైదరాబాద్‌పై సెంచరీ(100)

- 2023లో గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ(101*)

అంతేకాకుండా కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 229 ఇన్నింగ్సుల్లో 37.25 సగటుతో 7263 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు(973) చేసిన ఆటగాడిగానూ రికార్డు దక్కించుకున్నాడు. ఓ సీజన్‌లో అత్యధిక సెంచరీలు(4) సాధించిన ప్లేయర్‌గా సంయుక్తంగా బట్లర్‌తో కలిసి పంచుకున్నాడు.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. చాలా గొప్పగా ఫీలవుతున్నాను. చాలా మంది టీ20 క్రికెట్‌లో నా ఆట తగ్గిందన్నారు. కానీ నేను అలా అస్సలు అనుకోవట్లేదు. టీ20 క్రికెట్‌లో మరోసారి నా బెస్ట్ ఇచ్చాను. ఈ రోజు మ్యాచ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి పాలైంది. ఫలితంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. 198 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది గుజరాత్. శుబ్‌మన్ గిల్ అద్భుత శతకంతో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 52 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు విజయ్ శంకర్(53) అర్ధశతకంతో చక్కటి సహకారం అందించడంతో గుజరాత్ సులభంగా గెలిచింది. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా.. విజయ్ కుమార్ వ్యష్క్, హర్షల్ పటేల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నాడు.