Naveen vs Kohli: కోహ్లిని మళ్లీ కెలుక్కున్న నవీనుల్.. ఇన్‌స్టా స్టోరీపై ఫ్యాన్స్ సీరియస్
Naveen vs Kohli: కోహ్లిని మళ్లీ కెలుక్కున్నాడు నవీనుల్ హక్. అతని ఇన్‌స్టా స్టోరీపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో విరాట్ ఔటైన తర్వాత నవీన్ ఓ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేశాడు.
Naveen vs Kohli: విరాట్ కోహ్లిని మరోసారి కెలుక్కున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీనుల్ హక్. మంగళవారం (మే 9) ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లి కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. దీంతో అతని వైఫల్యాన్ని ఉద్దేశించి పరోక్షంగా నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది.
దీనిపై కొందరు అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఆర్సీబీ, ఎంఐ మ్యాచ్ చూస్తున్న ఫొటోను ఈ సందర్భంగా నవీన్ షేర్ చేశాడు. కోహ్లి ఔటైన తర్వాత టీవీలో మ్యాచ్ చూస్తున్న ఫొటో తీసినట్లు కనిపిస్తోంది. తన ముందు మామిడిపండ్లు పెట్టుకొని స్వీట్ మ్యాంగోస్ అనే క్యాప్షన్ అతడు ఉంచాడు. ఎక్కడా కోహ్లి గురించి మాట్లాడకపోయినా.. పరోక్షంగా అతడు విరాట్ గురించే ఈ కౌంటర్ వేసినట్లు స్పష్టమవుతోంది.
ఎంఐతో మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే విరాట్ తొలి ఓవర్లోనే 1 పరుగు చేసి ఔటయ్యాడు. బెహ్రన్‌డార్ఫ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నిజానికి మొదట అంపైర్ నాటౌట్ ఇవ్వగా ముంబై ఇండియన్స్ డీఆర్ఎస్ తీసుకుంది. రీప్లేలలో కోహ్లి బ్యాట్ కు బంతి తగిలినట్లు స్పష్టంగా తేలింది.
ఆ కాసేపటికే నవీన్ ఈ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. ఆర్సీబీ, లక్నో మ్యాచ్ సందర్భంగా నవీన్, కోహ్లి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. లక్నో 17వ ఓవర్లో తొలిసారి నవీనుల్ హక్ ను విరాట్ ఏదో అన్నాడు. మ్యాచ్ తర్వాత కూడా ఈ ఇద్దరు ప్లేయర్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అది చూసిన గంభీర్ కూడా విరాట్ తో గొడవ పడ్డాడు. ఆ మ్యాచ్ తర్వాత కూడా విరాట్ ను ఉద్దేశించి నవీన్ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేశాడు.
అయితే తాజాగా మరోసారి కోహ్లిపై నవీనుల్ చేసిన ఈ పోస్ట్ తో ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పట్లో తొలిగేలా లేవని స్పష్టమవుతోంది. ఈ పోస్టుపై కోహ్లి అభిమానులు సీరియస్ అవుతున్నారు. నీ దేశం కంటే కూడా విరాట్ కోహ్లి గొప్ప అన్న విషయం గుర్తుంచుకో అని ఓ అభిమాని ట్వీట్ చేయడం విశేషం.
సంబంధిత కథనం