Holi Mythology । హోలీ పండుగ విశిష్టతను తెలియజేసే పురాణ గాథలు!-know the mythology of holi 2023 cultural significance stories on origin to celebrate colors festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Know The Mythology Of Holi 2023, Cultural Significance, Stories On Origin To Celebrate Colors Festival

Holi Mythology । హోలీ పండుగ విశిష్టతను తెలియజేసే పురాణ గాథలు!

HT Telugu Desk HT Telugu
Mar 02, 2023 11:25 AM IST

Holi Mythology: హోలీ పండుగను ఎందుకు జరుపుంటారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? హోలీ పండగ విశిష్టతను ఇక్కడ తెలుసుకోండి.

Holi Mythology
Holi Mythology (Unsplash)

Holi Mythology: వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను హోలీ పూర్ణిమ లేదా అని కూడా అంటారు. ఈ పండుగ రోజున ఒకరికొకరు సరదా రంగులు పూసుకుంటూ ఆనందోత్సహాల మధ్య వేడుకలు జరుపుకుంటారు. అందుకే రంగుల పౌర్ణమి అనే పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది. వసంతకాలంలో వచ్చిన పౌర్ణమి అయినందున వసంత పౌర్ణమి అని, ఫాల్గుణ మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి ఫాల్గుణ పౌర్ణమిగా ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

హోలీ పండుగను ఎందుకు జరుపుంటారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? పురాణగాథల ప్రకారం హోలీ పండుగకు సంబంధించి అనేక కథనాలు చలామణీలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కథలను ఇప్పుడు తెలుసుకుందాం.

రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నం

భాగవత పురాణం ప్రకారం, రాధాకృష్ణుల దైవిక ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగ పుట్టుక జరిగినట్లు ఉంది. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది, అప్పట్నించి అందరూ బృందావనం, మధుర, నంద్‌గావ్ ప్రాంతాల ప్రజలు హోలీ సంబురాలు జరుపుకోవడం ప్రారంభించారు.

ఇదే కథ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని బర్సానా పట్టణంలో 'లాత్మార్ హోలీ' పేరుతో వేడుకలు జరుగుతాయి. హోలీ సందర్భంగా ఇక్కడి మహిళలు పురుషులను కర్రలతో వెంబడిస్తూ, వారిని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడతారు. బర్సానా అనేది రాధ స్వస్థలం. తల్లి యశోద మాట విని శ్రీకృష్ణుడి అతడి స్నేహితులతో కలిసి, రాధ వద్దకు వస్తారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు రాధకు, అతడి స్నేహితులు అక్కడి గోపికలకు రంగులు పూస్తారు. దీంతో వారు వీరిని కర్రలతో వెంబడిస్తారు.. ఇదే సంప్రదాయం ప్రతీ హోలీకి కొనసాగుతుంది.

బృందావన్, మధురలో 'ఫూలోన్ కి హోలీ' పేరుతో పండగ జరుగుతుంది. హోలీ పండుగను జరుపుకోవడానికి రంగులకు బదులుగా పువ్వులు ఉపయోగిస్తారు.

కాముడు- రతీదేవి

శివపురాణాల ప్రకారం.. పరమశివుడు, అన్నింటినీ వదిలి తన ధ్యానంలోనే సమాధి అవుతాడు. దీనికి ఆందోళన చెందిన పార్వతీదేవి ప్రేమ దేవుడైన కాముడిని సహాయం కోరుతుంది. దీంతో కాముడు శివుడిపై మన్మధబాణం విసురుతాడు. ధ్యానం విచ్చిన్నం అవడంతో శివుడు కోపోద్రిక్తుడై కాముడిపై మూడో కన్ను తెరుస్తాడు. దీంతో కాముడు భస్మం అవుతాడు. అయితే కాముడి భార్య రతీదేవి కఠోర దీక్ష చేసి శివునికి శరణు కోరగా, శివుడు కామదేవుడిని క్షమించి అతనిని తన దైవిక రూపానికి తిరిగి ఇస్తాడు. ఇది ఫాల్గుణ పౌర్ణమి ఘడియల్లోనే జరుగుతుంది. అన్ని వేళలా కామం తగదని హోలీకి ఒకరోజు ముందు కామదహనం నిర్వహిస్తారు, ఆ మర్నాడు హోలీ వేడుకలు జరుపుకుంటారు.

హోలిక దహనం

విష్ణుపురాణాల ప్రకారం.. రాక్షస రాజు హిరణ్యకశిపుడు ఏ దేవుడు, ఏ మనిషి, ఏ జంతువుతో తనకు మరణం ఉండకూడదని వరం పొందుతాడు. తననే దేవుడిగా కొలవమని ప్రజలను ఆజ్ఞాపిస్తాడు. అయితే విష్ణు భక్తుడైన అతడి కుమారు ప్రహ్లాదుడే తన తండ్రిని పూజించడు. దీంతో హిరణ్యకశిపుడు సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపాల్సిందిగా సూచిస్తాడు. హోలిక చితిమంటలతో నిరంతరం మండుతూ ఉంటుంది. ఆమెకు అలాంటి రక్షణ కవచం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుడిని చంపేందుకు తన ఒడిలో కూర్చోవాల్సిందిగా లాలిస్తుంది. ఆమె సూచించినట్లుగా ప్రహ్లాదుడు చితిమంటల ఒడిలో కూర్చుంటాడు. అయినప్పటికీ విష్ణు అనుగ్రహం కలిగిన ప్రహ్లాదుడిని చితి దహించదు, బదులుగా ఆ చితిలోనే హోలికా భస్మం అవుతుంది. అనంతరం విష్ణువు సగం నరుడు, సగం సింహంగా నరసింహుడిగా హిరణ్యకశిపుడుగా సంహరిస్తాడు. ఇది ఫాల్గుణ పౌర్ణమి రోజే జరిగిందని పురాణాల కథనం. ఈ విధంగా హోలికా దహనం, ఆ తర్వాత హోలీ వేడుకలు జరుగడం ప్రారంభమైంది.

WhatsApp channel

సంబంధిత కథనం