Festival of Colors । రంగుల పండుగ హోలీని ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసా?!-from lathmar holi to ringis billa see how india celebrates festival of colors in different ways ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Festival Of Colors । రంగుల పండుగ హోలీని ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసా?!

Festival of Colors । రంగుల పండుగ హోలీని ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసా?!

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 03:00 PM IST

Festival of Colors: హోలీని దేశంలోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా జరుపుకుంటారు. ఏయే ప్రదేశాలలో హోలీని ఎలా జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకోండి.

Holi Celebrations in India
Holi Celebrations in India (istock)

Holi 2023: హోలీ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన హిందూ పండుగలలో ఒకటి. అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంతో, సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం, హోలీని మార్చి 8న జరుపుకుంటున్నారు. ఈ పండుగను సాధారణంగా 'రంగుల పండుగ' (Festival of Colors) అని పిలుస్తారు. ఈరోజున అందరు ఒకరికొకరు రంగులను పూసుకుంటూ రంగులమయంగా మారతారు. ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చే, సామరస్యాన్ని పెంపొందించే, ఆనందాన్ని పంచే పండుగ. ఆనందంగా వేడుకలు జరుపుకునే ప్రతీ పండుగలాగే ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం కూడా చెడుపై మంచి విజయం సాధించడం. అవి విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల మేళవింపుతో అసలైన భారతీయతను చాటుతాయి.

Holi Celebrations in India- భారతదేశంలో హోలీ వేడుకలు

హోలీని దేశంలోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల జరిగే హోలీ పండుగ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఏయే ప్రదేశాలలో హోలీని ఎలా జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకోండి.

లాత్మార్ హోలీ, బర్సానా -నంద్‌గావ్

లాత్మార్ హోలీ వేడుకలు చాలా సరదాగా ఉంటాయి, ఈ వేడుకల్లో పాల్గొనాలని చాలా మంది ఉత్సాహం చూపుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బర్సానా, నంద్‌గావ్ అనే రెండు పట్టణాలు ఈ రకమైన హోలీ వేడుకలకు ప్రసిద్ధి. బర్సానా అనేది రాధ స్వస్థలంగా పేర్కొంటారు. శ్రీకృష్ణుడు అతడి స్నేహితులు కలిసి హోలీ ఆడటానికి నందగావ్ నుండి బర్సానా సందర్శించినప్పుడు అక్కడి గోపికలతో వారు చిలిపి పనులు, కొంటె పనులు చేయగా.. వారు కర్రలతో కొట్టడానికి వస్తే, శ్రీకృష్ణుడు, స్నేహితులు తప్పించుకుంటూ ఆడే హోలీ ఆటలు సరదాగా సాగుతాయి. ఇదే నేపథ్యంలోనే ప్రతీ సంవత్సరం బర్సానా -నంద్‌గావ్ హోలీ వేడుకలు జరుగుతాయి. మగావారు హోలీ ఆడటానికి వెళ్తే, ఆడవారు కర్రలతో వస్తారు. వారిని తప్పించుకుంటూ తిరగాలి.

ఫూల్ వాలీ హోలీ, బృందావన్-మధుర

యూపీలోని బృందావన్ పట్టణంలో పూలతో హోలీ జరుపుకుంటారు. అందుకే దీనిని ‘ఫూల్ వాలీ హోలీ’ లేదా ‘ఫూలోన్ కి హోలీ’ అంటారు. ఇక్కడి స్థానిక బాంకే బిహారీ ఆలయంలో కృష్ణ భక్తులు ఒకరిపై ఒకరు పూల రేకులు చల్లుకుంటూ హోలీ ఆడతారు. సాయంత్రం వేళలోఆలయ పూజారులు ఆలయాన్ని సందర్శించే భక్తులపై పూల వర్షం కురిపిస్తారు.

శ్రీకృష్ణుని జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన మధురలోనూ లాత్మార్ హోలీ, ఫూల్ వాలీ హోలీ అంటూ భిన్న రూపాలలో హోలీ జరుపుకుంటారు. హోలీ వేడుకలకు మధుర చాలా ప్రసిద్ధి. దేశం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు హోలీ ఆడటానికి వస్తారు. సాయంత్రం వేళలో రాస లీల నాటకాల ప్రదర్శన ఉంటుంది.

హోలా మొహల్లా, అమృత్సర్

ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని వసంత ఉత్సవాల్లో హోలా మొహల్లాగా హోలీ వేడుకలు జరుగుతాయి. హోలా మొహల్లా అనేది సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ మార్గదర్శకత్వంలో జరిగే ఒక సంప్రదాయ తంతు. ఇందులో భాగంగా నిహాంగ్ సిక్కులు యుద్ధ కళల ద్వారా తమ శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కుస్తీ, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ విన్యాసాలు ఉంటాయి.

కామదహనం, హోలీ- తెలంగాణ

హోలీకి కొన్నిరోజుల ముందు నుండే తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు, యువకులు కలిసి ఒక బృందంగా ఏర్పడతారు. వారు ఇంటింటికి తిరుగుతూ 'రింగీస్ బిల్లా రూపాయి దండ' అంటూ కోలాటం ఆడుతూ చందాలు వసూలు చేస్తారు. హోలీకి ఒకరోజు ముందు ఫాల్గుణ పౌర్ణమి గడియల్లో కర్రలు పేర్చి కామదహనం నిర్వహిస్తారు. ఇది సంక్రాతి భోగి మంటలను తలపిస్తుంది. ఆ తర్వాత రోజు రంగులు పూసుకుంటూ హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. హైదరాబాద్ లోనూ హోలీ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. న్యూఇయర్ తరహాలో హోలీ ఫెస్టివల్స్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి.

యోసాంగ్, మణిపూర్

మణిపూర్‌లో హోలీ పండుగను స్థానిక యయోసాంగ్ పండుగతో సమానంగా నిర్వహిస్తారు. జానపద నృత్యాలు, సంగీత కచేరీలు, భోగి మంటలు, క్రీడా కార్యక్రమాలు, రంగులతో ఆడుకోవడంతో సహా ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

బసంత్ ఉత్సవ్, బెంగాల్

బెంగాలీలు హోలీని బసంత్ ఉత్సవ్‌గా జరుపుకుంటారు, దీనినే వసంతోత్సవం అని కూడా పిలుస్తారు, దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ పరిచయం చేశారు. శాంతినికేతన్ యూనివర్శిటీలో వేడుకలు ఘనంగా జరుగుతాయి. హోలీ వేడుకలకు ఇక్కడ ప్రత్యేకంగా పసుపు రంగును మాత్రమే వినియోగిస్తారు. పసుపు దుస్తులు ధరిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం