తైవాన్‌పై దండయాత్రకు చైనా స్కెచ్..! మరో 'యుద్ధం' తప్పదా?
Will China invade Taiwan | తైవాన్‌పై దండయాత్రకు చైనా స్కెచ్ వేసిందా? అవసరమైతే యుద్ధానికి దిగాలని ఆలోచిస్తోందా? చైనీస్ భాషలో పలువురు మాట్లాడుకుంటున్న ఆడియో క్లిప్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇదే జరిగితే.. మరో యుద్ధం తప్పదా?
Will China invade Taiwan | రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో తీవ్ర అలజడులు నెలకొన్న సమయంలో.. ప్రపంచానికి మరో భయం పట్టుకుంది! తైవాన్‌పై చైనా దండయాత్రకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇందుకు సంబంధించిన చైనా 'ఆడియో క్లిప్స్' ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ట్రెండింగ్ వార్తలు
యుద్ధం కూడా జరగొచ్చు..!
ఎన్నో ఏళ్లుగా తైవాన్‌కు స్వతంత్ర ప్రభుత్వం ఉంది. కాగా.. తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తూ వస్తోంది. ఏదో ఒకరోజున.. తైవాన్ను తమ భూభాగంలో చేర్చుకుంటామని చైనా ఇప్పటికే అనేకమార్లు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పలుమార్లు ఉద్రిక్త వాతావరణం సైతం నెలకొంది.
కాగా.. 'మిషన్ తైవాన్'పై చైనా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. చైనా ఉన్నతాధికారుల మధ్య ఓ రహస్య సమావేశం జరిగిందంటూ.. గంట నిడివి గల ఆడియో క్లిప్ ఒకటి బయటకొచ్చింది. అందులో అనేకమంది చైనీస్ భాషలో మాట్లాడుకున్నారు.
ఆడియో క్లిప్ ప్రకారం..
China Taiwan news | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన సీనియర్ అధికారులు.. పీపుల్స్ లిబరేషన్ అర్మీ సభ్యులతో భేటీ అయ్యారు. తైవాన్ను అణచివేయడం, ఆ దేశ భద్రతాదళాలను చిన్నాభిన్నం చేయడం వంటి విషయాలపై వారు మాట్లాడుకున్నారు. అవసరమైతే యుద్ధాన్ని మొదలుపెట్టడానికైనా వెనకడుగు వేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. చైనా సార్వభౌమత్వానికి, సరిహద్దు భద్రతకు ఇది ఎంతో అవసరమని ఏకీభవించారు.
దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతం నుంచి దండయాత్ర మొదలు పెట్టాలని అధికారులు భావించారు. పక్కా ప్రణాళిక రచించి, అవసరమైన సైన్యాన్ని, వస్తువులను మోహరించి ముందుకు సాగాలని నిర్ణయించారు. సాధారణ పరిస్థితులు.. యుద్ధానికి దారితీసినట్టుగా చిత్రీకరించాలని వారు ఆలోచిస్తున్నారు.
కాగా.. ఆడియో క్లిప్‌ను పరిశీలిస్తే.. గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో ఇప్పటికే పలు కంపెనీలు చైనా 'ప్రయోజనాల' కోసం పని చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ మిషన్ కోసం 1.40లక్షల మిలిటరీ సిబ్బంది, 953 ఓడలు, 1,653 మానవరహిత ఆయుధ పరికరాలు, 20 విమానాశ్రయాలు- ఓడరేవులతో పాటు ఆహార ధాన్యాలు, ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంక్‌లు, గ్యాస్ స్టేషన్లు కావాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. వీటిని సమకూర్చే బాధ్యత గ్వాంగ్‌డాంగ్ అధికారులకు అప్పగించారు!
అంతేకాకుండా.. ఈ వ్యవహారం కోసం నియామకాలు చేపట్టేందుకు మిలిటరీ సిబ్బందిని రంగంలోకి దింపాలని అధికారులు భావించారు. రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఈ ఆడియో క్లిప్‌పై చైనా స్పందించలేదు. కాగా.. ఈ ఆడియో క్లిప్‌లో ఉన్న మాటలు.. అసలు చైనా అధికారులవేనా? లేక వీటిని తైవాన్ చిత్రీకరించి.. చైనా మీద ఆరోపణలు చేస్తోందా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాగా.. చైనా అధికారుల్లోని కొందరు.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ కుట్రలను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ ఆడియో క్లిప్స్‌ను లీక్ చేసినట్టు పలువురు భావిస్తున్నారు.
అమెరికా- చైనా మాటల యుద్ధం..
జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తైవాన్ వ్యవహారంపై స్పందించారు. 'తైవాన్‌పై చైనా దాడి చేస్తే.. నిప్పుతో చెలగాటం ఆడినట్టే. తైవాన్ ప్రయోజనాలకు మేము అండగా ఉంటాము. తైవాన్‌కు సాయం చేస్తాము,' అని తేల్చిచెప్పారు.
బైడెన్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. తైవాన్ అనేది తమ దేశ అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేసింది. తైవాన్ తమ దేశంలో ఓ భాగమని పేర్కొంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. దేశ ప్రయోజనాల కోసం చైనా ఎంత దూరమైన వెళుతుందని తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్