`చూస్తూ కూర్చుంటే.. ఉక్రెయిన్ ప‌రిస్థితే తైవాన్‌కు..!` - జ‌పాన్ హెచ్చ‌రిక‌-japans pm fumio kishida warns invasion of ukraine could be replicated in taiwan by china ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Japan's Pm Fumio Kishida Warns Invasion Of Ukraine Could Be Replicated In Taiwan By China

`చూస్తూ కూర్చుంటే.. ఉక్రెయిన్ ప‌రిస్థితే తైవాన్‌కు..!` - జ‌పాన్ హెచ్చ‌రిక‌

HT Telugu Desk HT Telugu
May 07, 2022 05:57 PM IST

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల‌పై అంత‌ర్జాతీయ స‌మాజం ఒక్క‌టిగా స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జ‌పాన్ పేర్కొంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, ఉక్రెయిన్ ఆక్ర‌మ‌ణ‌కు ర‌ష్యా ప్ర‌య‌త్నించిన‌ట్లే.. తైవాన్‌ను ఆక్ర‌మించడానికి చైనా దాడులు చేస్తుంద‌ని హెచ్చ‌రించింది.

తైవాన్ రాజ‌ధాని తేపే న‌గ‌రం
తైవాన్ రాజ‌ధాని తేపే న‌గ‌రం

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఆక్ర‌మ‌ణ దాడుల‌పై ప్ర‌పంచంలోని అగ్ర‌దేశాలు ఒక్క‌టిగా స్పందించాల‌ని జ‌పాన్ ప్ర‌ధాని ఫ్యుమియొ కిషిదా కోరారు. ఆ దాడుల‌ను ఖండిస్తూ, చ‌ర్య‌లు చేప‌ట్ట‌న‌ట్ల‌యితే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అలాంటి దాడులు మ‌రిన్ని జ‌రుగుతాయ‌న్నారు. ఈ దాడుల‌ను చూస్తూ ఇలాగే ఉండిపోతే, చైనా దాడుల‌తో ఉక్రెయిన్ ప‌రిస్థితే తైవాన్‌కు వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. లండ‌న్లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో జ‌పాన్ పీఎం పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాల మిల‌ట‌రీ ప‌రిమితుల‌ను అవకాశంగా తీసుకుని చైనా తైవాన్‌పై దాడికి తెగ‌బ‌డే ప్ర‌మాద‌ముంద‌ని ఫ్యుమియొ కిషిదా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స్వ‌యం పాల‌న‌లోని చిన్న‌ దేశాల‌పై వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం పొరుగుదేశాలు దాడులు చేస్తుంటే ఒక్క‌టిగా స్పందించాల్సిన బాధ్య‌త శ‌క్తిమంత‌మైన ఇత‌ర దేశాల‌పై ఉంటుంద‌న్నారు. జపాన్‌తో పాటు ఇత‌ర ఇండో ప‌సిఫిక్ మిత్ర దేశాలు తైవాన్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. ఆసియా వ్య‌వ‌హారాల్లో జీ 7 దేశాలు నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు.

<p>లండ‌న్‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తున్న జ‌పాన్ పీఎం ఫ్యుమియొ కిషిదా</p>
లండ‌న్‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తున్న జ‌పాన్ పీఎం ఫ్యుమియొ కిషిదా (REUTERS)

తైవాన్ చైనాదే!

తైవాన్ జ‌ల‌సంధిలో శాంతి, సుస్థిర‌త నెల‌కొన‌డం జ‌పాన్‌తో పాటు ఇండో- ప‌సిఫిక్ దేశాల‌కు, ఇత‌ర ప్ర‌పంచ దేశాల‌కు అవ‌స‌ర‌మ‌ని ఫ్యుమియొ కిషిదా స్ప‌ష్టం చేశారు. తైవాన్‌లో చైనాలో అంత‌ర్భాగ‌మని 1949 నుంచీ చైనా వాదిస్తోంది. త్వ‌ర‌లో శాంతియుతంగానే తైవాన్‌ను చైనాలో క‌లిపేస్తామ‌ని ఇటీవ‌ల చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ కూడా ప్ర‌క‌టించారు. చైనా ప్ర‌యోజ‌నాల‌కు అది అవ‌స‌ర‌మ‌న్నారు. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొన‌సాగుతున్న‌ప్పుడే.. చైనా కూడా తైవాన్‌ను ఆక్రమించ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చ‌ని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అయితే, చైనా ప్ర‌స్తుతం ఆ దిశ‌గా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్